122 రన్సా.. 8 వికెట్లా!

122 రన్సా.. 8 వికెట్లా!

 

  • సౌతాఫ్రికా టార్గెట్‌‌ 240... ప్రస్తుతం 118/2
  • బౌలర్లు మ్యాజిక్​ చేస్తేనే విక్టరీ!
  • ఇండియా సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ 266 ఆలౌట్‌‌

జొహన్నెస్‌‌బర్గ్‌‌:  ఇండియా గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. సౌతాఫ్రికా నెగ్గాలంటే ఇంకో 122 రన్స్‌‌ కొట్టాలి. నువ్వానేనా అన్నట్టు నడుస్తోన్న ఇండియా–సౌతాఫ్రికా సెకండ్‌‌ టెస్టు లెక్క ఇది.  మరో రెండు రోజుల ఆట మిగిలున్నా మ్యాచ్‌‌ నేడే (గురువారం) ఫినిష్‌‌ అవడం పక్కా. మూడో రోజు, బుధవారం ఆట అనేక మలుపులు తిరగ్గా.. రెండు టీమ్స్‌‌ దాదాపు ఈక్వల్‌‌గా పెర్ఫామ్‌‌ చేశాయి. అజింక్యా రహనె (58), చతేశ్వర్‌‌ పుజారా (53) సత్తా చాటడంతో స్టార్టింగ్‌‌లో ఇండియా హవా నడిచినా.. మధ్యలో సఫారీ బౌలర్లు మన స్పీడుకు బ్రేక్‌‌ వేశారు.  హనుమ విహారి (40 నాటౌట్) పోరాటంతో సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో ఇండియా 60.1 ఓవర్లలో 266 రన్స్‌‌ వద్ద ఆలౌటైంది. సఫారీ టీమ్‌‌కు 240 రన్స్‌‌ టార్గెట్‌‌  ఇచ్చింది. తర్వాత ఛేజింగ్‌‌కు వచ్చిన సౌతాఫ్రికా డే చివరకు 118/2 స్కోరుతో నిలిచి కాస్త మంచి పొజిషన్‌‌లో ఉంది. కెప్టెన్‌‌ డీన్‌‌ ఎల్గర్‌‌ (46 బ్యాటింగ్‌‌), డుసెన్‌‌ (11 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఆ టీమ్‌‌కు ఇంకో 122 రన్స్‌‌ అవసరం కాగా ఇండియాకూ అవకాశాలున్నాయి. ఫోర్త్‌‌ డే మార్నింగ్‌‌ సెషన్‌‌లో మన బౌలర్లు మ్యాజిక్‌‌ చేస్తే విక్టరీ ఆశించొచ్చు.  టీమ్‌‌ను గెలిపించే బాధ్యత ఇప్పుడు బౌలర్ల చేతుల్లోనే ఉంది.
ఆదుకున్న పుజారా, రహానె, విహారి
ఇండియా మూడో రోజు ఉదయం బాగా పెర్ఫామ్‌‌ చేసింది. ముఖ్యంగా రహానె , పుజారా  తమ కెరీర్‌‌ను నిలబెట్టుకునే ఇన్నింగ్స్‌‌లు ఆడారు. థర్డ్‌‌ వికెట్‌‌కు 111 రన్స్‌‌ జోడించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఇండియా ఒక్కసారిగా తడబడింది. రబాడ (3/77), జాన్సెన్‌‌ (3/67),  ఎంగిడి (3/43) మన స్పీడ్‌‌కు బ్రేకు లేశారు. అయితే, చివరి దాకా నిలబడ్డ విహారి టెయిలెండర్ల సపోర్ట్‌‌తో టీమ్‌‌ను ఆదుకున్నాడు.  ఓవర్‌‌నైట్‌‌ స్కోరు 85/2తో ఇండియా ఆట కొనసాగించగా.. రహానె, పుజారా వన్డే స్టయిల్లో స్పీడుగా ఆడారు. డిఫెన్సివ్‌‌ మైండ్‌‌ సెట్‌‌తో ఆడితే లాభం లేదని కౌంటర్‌‌ ఎటాక్‌‌ చేశారు.  జాన్సెన్‌‌ వేసిన ఓ షార్ట్‌‌ బాల్‌‌ను రహానె పాయింట్‌‌ మీదుగా సిక్స్‌‌  కూడా కొట్టాడు. ఇదే జోరుతో పుజారా 62 బాల్స్‌‌లో, రహానె 67 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకోగా స్కోరు 150 దాటింది. ఈ టైమ్‌‌లో సఫారీ బౌలర్లు ప్లాన్‌‌ మార్చారు. సీనియర్‌‌ పేసర్‌‌ రబాడ.. పిచ్‌‌పై క్రాక్స్‌‌ పడ్డ ప్లేస్‌‌లో బ్యాక్‌‌ ఆఫ్‌‌ లెంగ్త్‌‌  బాల్స్‌‌ వేస్తూ అనూహ్యమైన బౌన్స్‌‌ రాబట్టాడు. వెంటవెంటనే 3 వికెట్లు పడగొట్టి తమ టీమ్​ను రేసులోకి తెచ్చాడు. రహానె, పుజారా, పంత్‌‌ (0)  పెవిలియన్​ చేరడంతో155/2తో ఉన్న ఇండియా ఒక్కసారిగా 167/5తో డిఫెన్స్‌‌లో పడ్డది. ఈ దశలో హైదరాబాదీ విహారి ఓపిగ్గా బ్యాటింగ్‌‌ చేశాడు. కాసేపు తనకు సపోర్ట్‌‌ ఇచ్చిన అశ్విన్‌‌ (16).. ఎంగిడి వేసిన లెగ్‌‌ సైడ్‌‌ బాల్‌‌ను వెంటాడి కీపర్‌‌కు చిక్కాడు. తర్వాత బ్యాటింగ్‌‌కు వచ్చిన శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (28) .. ఐదు ఫోర్లు, ఓ సిక్స్‌‌తో ఎటాక్‌‌ చేసి స్కోరు 200 దాటించాడు. కానీ, మరో షాట్‌‌ ఆడే ప్రయత్నంలో బౌండ్రీ దగ్గర మహారాజ్‌‌కు చిక్కడంతో ఏడో వికెట్‌‌కు 41 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆ వెంటనే షమీ (0) డకౌట్‌‌ అయినా.. బుమ్రా (7), సిరాజ్‌‌ (0)తో కలిసి 17, 21 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్స్‌‌ చేసిన విహారి స్కోరు 260 దాటించాడు. 

బుమ్రాకు కోపమొచ్చింది..
గ్రౌండ్‌‌లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే పేసర్‌‌ బుమ్రా బ్యాటింగ్‌‌ చేస్తుండగా గుస్సా అయ్యాడు. సౌతాఫ్రికా పేసర్‌‌ మార్కో జాన్సెన్‌‌ అతనికి కోపం తెప్పించాడు. ఇన్నింగ్స్‌‌ 54వ  ఓవర్లో తను వేసిన రెండు షార్ట్‌‌బాల్స్‌‌ బుమ్రా కుడి భుజానికి తగిలాయి. బౌలర్​ తనవైపు  కోపంగా చూసినా బుమ్రా లైట్​ తీసుకున్నాడు. తర్వాత మరో షార్ట్‌‌ పిచ్​ బాల్‌‌కు బుమ్రా షాట్‌‌కు ట్రై చేసినా సరిగ్గా కనెక్ట్‌‌ అవ్వలేదు.ఈ టైమ్‌‌లో జాన్సెన్‌‌ స్లెడ్జింగ్‌‌ చేయబోగా.. బుమ్రా కోపంగా రియాక్ట్‌‌ అయ్యాడు.  పిచ్‌‌ మధ్యకు వచ్చి ఇద్దరూ మాటా మాటా అనుకోవడంతో అంపైర్‌‌ వచ్చి వీళ్లను విడదీశాడు. ఆ తర్వాత రబాడ బౌలింగ్‌‌లో బుమ్రా సిక్స్‌‌ కొట్టాడు.

నిలబడ్డ ఎల్గర్‌‌
టార్గెట్‌‌ ఛేజింగ్‌‌కు దిగిన సౌతాఫ్రికాకు మార్‌‌క్రమ్‌‌ (31), ఎల్గర్‌‌ మంచి ఓపెనింగ్‌‌ ఇచ్చారు.  ఫస్ట్‌‌ వికెట్‌‌కు ఇద్దరూ 10 ఓవర్లలోనే 49 యాడ్‌‌ చేశారు. ముఖ్యంగా మార్‌‌క్రమ్‌‌ చాలా స్పీడ్‌‌గా బ్యాటింగ్‌‌ చేశాడు. టీ బ్రేక్‌‌ తర్వాత బౌలింగ్‌‌కు వచ్చిన శార్దూల్‌‌ (1/24).. మార్‌‌క్రమ్‌‌ను ఎల్బీ చేసి ఇండియాకు బ్రేక్‌‌ ఇచ్చాడు. అయితే, ఎల్గర్‌‌ క్రీజులో కుదురుకోగా.. మరో ఎండ్‌‌లో వన్‌‌డౌన్‌‌ బ్యాటర్‌‌ కీగన్‌‌ పీటర్సన్‌‌ (28) జోరు చూపెట్టాడు. లాభం లేదని రాహుల్‌‌.. స్పిన్నర్‌‌ అశ్విన్‌‌ (1/14)ను బౌలింగ్‌‌కు దింపాడు. పిచ్‌‌పై ఏర్పడ్డ క్రాక్స్‌‌పై బాల్స్‌‌ వేసిన అశ్విన్‌‌.. కీగన్‌‌ను ఎల్బీగా ఔట్‌‌ చేశాడు. ఆ తర్వాత బౌలర్లను ఛేంజ్‌‌ చేసి ఎటాక్‌‌ చేసినా.. ఓ బాల్‌‌ హెల్మెట్‌‌కు తగిలినా ఎల్గర్‌‌ తగ్గలేదు. డుసెన్‌‌తో కలిసి డే ముగించాడు.