మధ్యప్రదేశ్లో తల్లి పై మూడేళ్ల బాలుడి ఫిర్యాదు

మధ్యప్రదేశ్లో తల్లి పై మూడేళ్ల బాలుడి ఫిర్యాదు

చిన్న పిల్లలు చేసే కొన్ని పనులు అప్పుడప్పుడు ఆశ్చర్యంగానూ... మరికొన్నిసార్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. మధ్య ప్రదేశ్ లో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. తల్లి తనను సతాయిస్తోందంటూ ఓ బుడ్డోడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మను జైలులో పెట్టండని డిమాండ్ చేశాడు. ఆ బుడతడి ఫిర్యాదు విని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. 

మధ్యప్రదేశ్ బుర్హాన్ పుర్ జిల్లా దేఢ్తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్ధాంకు తల్లి రోజు తలస్నానం చేయించి కాటుక పెట్టడం అలవాటు. అయితే అమ్మ  అలా చేయడం ఆ బుడ్డోడికి నచ్చేది కాదు. అంతేకాదు చాక్లెట్లు తినకుండా వాటిని దాచి పెట్టేది. దీంతో ఆ చిన్నారికి తల్లిపై చెప్పలేనంత కోపం వచ్చేది. ఈ మధ్య సద్దాం బాగా అల్లరి చేయడంతో అతని తల్లి ఓ చెంప దెబ్బ కొట్టింది. అంతే ఆ బుడ్డోడికి కోపం కట్టలు తెంచుకుంది. తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్దాం వస్తావా లేదా అని మారాం చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో తండ్రి అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంకా నాయక్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. అమ్మ తనకు ఇష్టం లేకపోయినా కాటుక పెడుతుందని, చాక్లెట్లు దొంగతనం చేస్తుందని కంప్లైంట్ చేశాడు. తన ఫిర్యాదు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ బుడ్డోడి తీరు చూసి ముచ్చటపడ్డ ఎస్సై.. చెప్పిందంతా పేపర్పై రాసి సద్దాం సంతకం తీసుకుంది. కంప్లైట్ ఆధారంగా అమ్మపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆ బుడ్డోడు ఇంటి బాట పట్టాడు.