మథురలోని 700 ఆలయాల్లో వేడుకలు

మథురలోని 700 ఆలయాల్లో వేడుకలు

న్యూఢిల్లీ : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని కృష్ణుడి పుట్టినిళ్లయిన మధురలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణవ్యాప్తంగా 700 దేవాలయాల్లో ప్రతిష్ఠాపన వేడుకలు జరిపారు. ప్రధాన కూడళ్లలో భోజనాలు, ప్రసాదాల పంపిణీ చేపట్టారు. శ్రీకృష్ణుడి ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలను సీతారాముడిలా అలంకరించామని శ్రీకృష్ణ జన్మభూమి సేవా సంస్థాన్ నిర్వాహకులు తెలిపారు. వేణువు పట్టుకుని ఉండే శ్రీకృష్ణుడి విగ్రహానికి విల్లు, బాణం అమర్చినట్లు బంకే బిహారీ ఆలయ కమిటీ తెలిపింది. ఠాకూర్ ద్వారకాధీష్ ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రసాదాలు పంపిణీ చేశారు. 

ప్రవచనాలు, భక్తి పాటలతో కేశవదేవ్ ఆలయం రోజంతా మార్మోగింది. దేవర్హ ఘాట్, కన్హా గోశాల వద్ద యమునా నది నుంచి తెచ్చిన ఇసుకతో అయోధ్య రామాలయం, శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. వీటిని చూసేందుకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. మధుర అంతటా రెండ్రోజులుగా మట్టి దీపాలు, డెకరేషన్ లైటింగ్స్, కాషాయ జెండాలు విపరీతంగా అమ్ముడయ్యాయని అక్కడి దుకాణాదారులు చెప్తున్నారు. సోమవారం మధుర జిల్లా అంతటా 700 దేవాలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. వేడుకల నిర్వహిస్తున్న అన్ని ఆలయాల వద్ద భారీ 
బందోబస్తు ఏర్పాటు పోలీసులు వెల్లడించారు.