ఆ హోటల్ లో అన్నీబంగారు వస్తువులే

ఆ హోటల్ లో అన్నీబంగారు వస్తువులే

స్వర్ణ దేవాలయం గురించి తెలుసుకదా! ఆ గుడిని మొత్తం బంగారంతో కట్టారు కాబట్టే దానికి ఆ పేరొచ్చింది. అంత ఫేమస్​ అయింది! ఈ హోటల్​ కూడా అంతే ఫేమస్​ మరి. ఎందుకూ అంటారా! ఆ హోటల్​ పేరుతో పాటు అందులోని ప్రతి వస్తువులోనూ బంగారం ఉంది మరి. సీలింగ్​ దగ్గర్నుంచి స్విమ్మింగ్​ పూల్​ వరకూ, వడ్డించే స్పూన్లు, గంటెల నుంచి ప్లేట్ల వరకూ, టాయిలెట్ల నుంచి బాత్​ టబ్బుల వరకూ అన్ని బంగారంతోనే చేయించారు. అదే గోల్డెన్​ బే హోటల్​. వియత్నాంలోని దనాంగ్​లో ఉంది.

మూడేళ్ల క్రితం హొవా బిన్​ గ్రీన్​ కార్పొరేషన్​ అనే కంపెనీ ఆ హోటల్​ను కట్టించింది. 28 అంతస్తుల్లో కట్టిన ఈ హోటల్​ ప్రతి అంతస్తులోనూ బంగారమే స్పెషల్​. రిసెప్షన్​ దగ్గర గోడలకూ, లాబీల్లోని సీలింగ్​కూ బంగారం తాపడం వేయించింది కంపెనీ. కుర్చీలూ బంగారమే. అంతేకాదు, గోడలకు పెట్టే అలంకరణ సామగ్రినీ బంగారంతోనే చేయించింది. హోటల్​ పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్​పూల్​ అడుగును బంగారంతో పూతపూయించింది.

ఈ ఇన్​ఫినిటీ స్విమ్మింగ్​ పూల్​ గిన్నిస్​ రికార్డుల్లోకీ ఎక్కింది. మరి, బాత్​రూంలకు బంగారం ఎందుకంటే.. ఎంత ఒత్తిడి ఉన్నా స్నానం చేస్తే అదంతా పోయి హాయిగా ఉంటుందని, మంచి మంచి ఆలోచనలూ బాత్రూంలోనే వస్తుంటాయని, అందుకే బాత్రూంలోనూ బంగారం పెట్టించామని కంపెనీ చెబుతోంది. మరి, అంత బంగారంతో కట్టించిన హోటల్​లో ఉండాలంటే అంతే డబ్బులు ఖర్చు పెట్టాలి. విలాసాల్లో మునిగి తేలాలంటే చేతి చమురు వదలాల్సిందే! బాగుంది కదా ఈ బంగారం హోటల్​!