ప్లాస్టిక్ వాడకం తగ్గించే ఎనీ టైమ్​ బ్యాగ్

ప్లాస్టిక్ వాడకం తగ్గించే ఎనీ టైమ్​ బ్యాగ్
  • ప్లాస్టిక్ వాడకం తగ్గించే ఎనీ టైమ్​ బ్యాగ్
  • బాలానగర్​ ఫ్రూట్ ​మార్కెట్​లో ఏటీఎం లాంటి ఏటీబీ
  • ప్రైవేట్ ​కంపెనీలతో  కలిసి ఏర్పాటు చేసిన బల్దియా
  • సిటీలోని మరిన్ని చోట్ల పెట్టాలని జనాల నుంచి రిక్వెస్టులు 

కూకట్​పల్లి, వెలుగు:  ప్లాస్టిక్ ​క్యారీ బ్యాగ్​ల వాడకం తగ్గించేందుకు బాలానగర్​ ఫ్రూట్ ​మార్కెట్​లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీబీ(ఎనీ టైమ్ ​బ్యాగ్)కు జనం నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. తక్కువ రేటుకే ప్లాస్టిక్​ కంటే మంచి క్వాలిటీ కాటన్ ​బ్యాగ్ ​అందిస్తుండడంతో హ్యాపీగా తీసుకుంటున్నారు. కూకట్​పల్లి సర్కిల్ పరిధిలోని బాలానగర్ ఫ్రూట్ మార్కెట్​లో ‘మోవేట్, యునైటెడ్​వే’ అనే సంస్థల సహకారంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఏటీబీ మెషీన్​ను ఏర్పాటు చేశారు. రెండు వారాల క్రితం జోనల్ కమిషనర్ మమత ప్రారంభించారు. క్యారీ బ్యాగ్​ఆకారంలో, చిన్నగా ఉండడంతో మార్కెట్​కు వచ్చే కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది సేమ్​ ఏటీఎం మాదిరిగానే పనిచేస్తుంది. అక్కడ స్వైపింగ్ ​కార్డు ద్వారా డబ్బు డ్రా చేసుకుంటే, ఇక్కడ 10 రూపాయల నోట్ పెడితే ఏటీబీ ఒక కాటన్ ​క్యారీ బ్యాగ్ ​ఇస్తుంది.

ఈ బ్యాగ్​లో దాదాపు 5 కిలోల వరకు పండ్లు, కూరగాయలు తీసుకెళ్లొచ్చు. క్యారీ బ్యాగ్​లు లేకుండా మార్కెట్​కు వచ్చేవారు ఈ మెషీన్​ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. రూ.15 – 20 పెట్టి ప్లాస్టిక్​ కవర్ ​కొనే కంటే రూ.10 పెట్టి కాటన్ బ్యాగ్​తీసుకోవడం మేలని, రీయూజ్​ చేసుకునేందుకు వీలుగా ఉంటుందని చెబుతున్నారు. సిటీలోని ఇతర మార్కెట్లు, రైతు బజార్ల వద్ద కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. త్వరలో కేపీహెచ్​బీ కాలనీ – జేఎన్టీయూ రోడ్డులోని రైతుబజార్​లో  ఏటీబీ పెట్టేందుకు ప్లాన్​ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత సిటీలో అన్ని మార్కెట్లలో ఏర్పాటు చేస్తామంటున్నారు.

ఏటీబీ చాలా బాగుంది

ఏటీబీ మెషీన్ ఐడియా చాలా బాగుంది. పొద్దున్నే హడావుడిగా మార్కెట్​కు వెళ్లినప్పుడు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లే టైంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలన్నా తప్పక ప్లాస్టిక్​ బ్యాగ్ కొనాల్సి వస్తోంది. అలాంటి టైంలో రూ.10లకే క్వాలిటీ కాటన్​ బ్యాగ్​ దొరుకుతోంది.
– కుమార్, చింతల్

కాటన్​ బ్యాగ్​లే కొంటున్నరు

ఏర్పాటు చేసి రెండు వారాలే అయినా జనం నుంచి మంచి స్పందన వస్తోంది. డైలీ చాలా మంది బ్యాగులు లేకుండానే మార్కెట్​కు వస్తుంటారు. మమ్మల్ని ప్లాస్టిక్ బ్యాగులు ఇవ్వమని అడుగుతుంటారు. ఏటీబీ మెషీన్​ను పెట్టిన తర్వాత దాదాపు అంతా కాటన్​ బ్యాగ్​లు తీసుకుంటున్నారు. 
– మహేశ్, వ్యాపారి, బాలానగర్​ ఫ్రూట్ ​మార్కెట్