
కమెడియన్ నుంచి హీరోగా, హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయిన సునీల్.. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఇతర భాషల్లోనూ బిజీ అయ్యాడు. ‘పుష్ప’లో పోషించిన మంగళం శ్రీను పాత్ర పాన్ ఇండియా వైడ్‌గా సునీల్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. దీంతో తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మలయాళంలోనూ ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రం ‘టర్బో’.
ఇందులో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. వైశాక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మమ్ముట్టినే నిర్మించారు. మే 23న సినిమా విడుదల కానుంది. ఇటీవల కన్నడ నటుడు రాజ్ బీ శెట్టి లుక్‌ను విడుదల చేశారు. తాజాగా సునీల్ ఫస్ట్ లుక్‌ను మమ్ముట్టి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఇందులో అతను ‘ఆటో బిల్లా’ అనే పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్‌ను బట్టి నెగటివ్ టచ్ ఉండే పాత్ర అని అర్థమవుతోంది. ఇప్పటికే తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సునీల్.. ఈ సినిమా తర్వాత మలయాళంలోనూ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.