SI ని కాలితో తన్నిన ఎమ్మెల్యే కుమారుడు రిమాండ్

SI ని కాలితో తన్నిన ఎమ్మెల్యే కుమారుడు రిమాండ్

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్‌ను పోలీసులు ఇవాళ(బుధవారం) రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్ని ఇష్టానుసారంగా ప్రవర్తించారనే కేసులో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు తో ఎమ్మెల్యే తనయుడిపై 332, 353, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

మరోవైపు పోలీసులతో ప్రసాద్‌ కుటుంబ సభ్యులు వ్యవహరించిన విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సోమవారం రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్ ఖానామిట్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో భాగంగా కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని ఎందుకు ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా గొడవకు దిగాడు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ SI రాజగోపాల్‌రెడ్డిపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ ఫిర్యాదుతో ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇవాల ప్రసాద్ ను రిమాండ్ కు తరలించారు.