
తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈసీ స్పందించకపోవడంతో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సర్కార్ తెలిపింది. మే 18వ తేదీ శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, కేబినెట్ సమావేశం సాయంత్రం ఏడింటి వరకు కూడా ప్రారంభం కాలేదు. దీంతో కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ కొనసాగింది. మంత్రివర్గ సమావేశం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినా.. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. దీంతో సీఎంఓ వర్గాలు ఈసీ పర్మిషన్ కోసం వేచిచూశాయి.
పర్మిషన్ పై క్లారిటీ రాకపోవటంతో.. సెక్రటేరియట్ లో ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ సహా.. ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
అయితే, ఈ సమీక్ష అనంతరం కొద్దిసేపు వేచి చూసిన సీఎం, మంత్రులు.. అప్పటికీ ఈసీ నుంచి క్లారిటీ ఇవ్వకపోవడంతో సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో కొన్ని కీలక అంశాలను చర్చించలేకపోయామన్నారు. కేబినెట్ భేటీపై సోమవారం లోగా ఈసీ అనుమతి కోసం వేచి చూస్తామన్నారు. అవసరమైతే.. మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం చెప్పారు.