అమరావతి రాజధాని కాదు.. రాజస్థాన్ ఎడారి

అమరావతి రాజధాని కాదు.. రాజస్థాన్ ఎడారి

న్యూఢిల్లీ, వెలుగు: రాజధాని అమరావతికి వెళ్లాలంటే, రాజస్థాన్ ఎడారికి వెళ్లినట్లు ఉంటుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రస్తుతం అమరావతిలో ఏం ఉందని ప్రశ్నించారు. క్యాపిటల్ కు వెళ్లినప్పుడు.. అలా కట్టపై నుంచి వెళ్తుంటే రాజధాని ఎక్కడనేది అర్థం కాలేదన్నారు. రాజధాని విషయంలో ప్రచారాలు, వాస్తవాలు వేరుగా ఉన్నాయని చెప్పారు. బహిరంగంగా ఈ మాటలు ఎవరూ చెప్పరని, వాస్తవాలు పరిశీలిస్తే  తెలుస్తుందన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఏపీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. అమరావతి భూముల్లో అవినీతి జరిగిందని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని ప్రాంత రైతులు ఐదోరోజులుగా ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఫిరాయింపులపై చర్యలకు చట్టం మార్చాలి

పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సాహించిన టీడీపీకి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారని తమ్మినేని అన్నారు. ఫిరాయింపులపై వేగంగా చర్యలు తీసుకునేలా చట్టం మార్చేందుకు కమిటీ వేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు.