చిరుతలు.. పెంపుడు జంతువులు

చిరుతలు.. పెంపుడు జంతువులు

ఎవరైనా కుక్కను పెంచుకుంటారు.. లేదంటే పిల్లుల్ని పెంచుకుంటారు. కానీ, చిరుత పులుల్ని తీసుకొచ్చి ఒళ్లో కూర్చోపెట్టుకుంటారా? కార్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి తిప్పుతారా? మెడకు బెల్టేసి వాకింగ్‌‌కు తీసుకెళతారా? లేదు కదా! కానీ, గల్ఫ్ ​దేశాల్లోని సంపన్నుల ఇళ్లలో ఇవి తరచూ కనిపిస్తాయి.  అరబ్‌‌ దేశాల్లోని చాలా మంది డబ్బున్నోళ్లకు చిరుతల్ని పెంచుకోవడం ఓ స్టేటస్‌‌ సింబల్‌‌. అందుకే ఆన్​లైన్​లో ఆర్డరిచ్చి మరీ చిరుతలను కొనేస్తున్నారు.  అయితే, వారి సరదా చిరుత పులుల చావుకొచ్చిందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. దీని వెనక పెద్ద ఎత్తున అక్రమ దందా నడుస్తోందని, చివరికి చిరుత జాతే అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని చీతా కన్జర్వేషన్ ​ఫండ్​(సీసీఎఫ్​) అనే సంస్థ హెచ్చరించింది. ఆఫ్రికాలోని సోమాలీ లాండ్​ అనే దేశం నుంచి సౌదీ అరేబియా వరకూ ఈ అక్రమ దందా ఎలా నడుస్తోందో ఆ సంస్థ ఇటీవల బయటపెట్టింది.

చిరుతను పెంచడం స్టేటస్​ సింబల్​

‘‘ఓ పెద్ద బంగళాలో ఒక చిరుత కూన నేషనల్ ​జియోగ్రాఫికల్ ​చానెల్​లో షోను చూస్తూ ఒక్కసారిగా షాక్ కు గురైంది. పెద్ద టీవీ స్క్రీన్​పై అడవిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్న పులి పిల్లలను చూసి అది ఒక్కసారిగా విచారంలోకి జారుకుంది. ఆ వీడియోను సోషల్‌‌ మీడియాలో పెట్టిన దాని ఓనర్‌‌, రాక్షసానందం పొందాడు. కానీ ఆ చిరుత బాధను ఎవరు పట్టించుకుంటారు?’’ అంటూ సీసీఎఫ్​ ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్​దేశాల్లోని చాలా మంది బిలియనీర్లు చిరుతలను పెంచుకోవడాన్ని స్టేటస్​సింబల్​గా చూస్తున్నారని, వాటితో ఫొటోలు దిగుతూ సోషల్​మీడియాలో పెట్టి గర్వంగా ఫీలవుతున్నారని తెలిపింది. ‘‘చిరుత కూనలు కావాలా? ఆడదైనా, మగదైనా ఫర్వాలేదు. రెండు, మూడు వారాల నుంచి రెండేండ్ల మధ్య ఏ వయసుది కావాలంటే ఆ వయసు చిరుతను మీకు అప్పగిస్తాం. రేటు జస్ట్​ రూ.5 లక్షలే!’’.. ఇదీ ఓ వెబ్​సైట్​లో కనిపించిన ప్రకటన. యూట్యూబ్, ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​ ద్వారా కూడా ఈ అక్రమ దందా సాగుతోందని సీసీఎఫ్​ వెల్లడించింది. తాను ఇప్పటికే 80 చిరుతలను అమ్మేశానని, డబ్బులిస్తే 25 రోజుల్లో మరో చిరుతను తెప్పిస్తానని ఆ వెబ్‌‌సైట్‌‌ ఓనర్‌‌ చెప్పాడు. ఒక్కో చిరుత రేటు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పలుకుతోందట.

కార్డ్​బోర్డ్​బాక్సుల్లో కుక్కి..

సోమాలీలాండ్​లోని ఓ అడవిలో కొన్ని వారాల కిందటే పుట్టిన మూడు చిరుతలను కార్డుబోర్డు బాక్సుల్లో కుక్కి దేశం దాటించే ప్రయత్నం చేశారు స్మగ్లర్లు. అయితే,  అధికారులు పట్టుకుని ఆ చిరుతలను రెస్క్యూ సెంటర్‌‌కు తరలించారు. బాక్సుల్లో కుక్కడం వల్ల అనారోగ్యం పాలైన ఆ చిరుతలు ఇప్పుడు బతికే అవకాశం చాలా తక్కువగా ఉందట. స్మగ్లర్ల నుంచి కాపాడిన చిరుతల సంఖ్య ఇప్పటికే 32కు చేరిందట. అయితే, స్మగ్లర్లు నాలుగు చిరుతలను తరలిస్తే, గమ్యం చేరేసరికి వాటిలో ఒక్కోసారి మూడు చిరుతలు చనిపోతున్నాయని చెబుతున్నారు. ఒక్క ఆ దేశం నుంచే ఏటా 300 చిరుత పిల్లలను స్మగ్లర్లు అక్రమంగా విదేశాలకు తరలించి అమ్మేస్తున్నారని సీసీఎఫ్​ చెబుతోంది. ఆఫ్రికాలోని పలు దేశాల నుంచీ ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిపింది. మొత్తం15 దేశాల్లో ఈ వ్యాపారం జరుగుతుండగా, 90% కొనుగోళ్లు గల్ఫ్​దేశాల నుంచే ఉంటున్నాయని పేర్కొంది.  ఒక్క సౌదీ నుంచే 60% ఆర్డర్లు వస్తున్నాయని తెలిపింది. ఇది ఆగకపోతే రెండేండ్లలో ఆ దేశాల్లో చిరుతలు అంతరించే ప్రమాదం ఉందని చెప్పింది.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి