పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!

పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
  •     అఫిలియేషన్ పూర్తి చేయకుండానే అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ 
  •     ఇప్పటి వరకు కేవలం 25 కాలేజీలకే గుర్తింపు 
  •     మిగిలిన కాలేజీలకు ఎప్పడిస్తారో క్లారిటీ లేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్టూడెంట్లు, పేరెంట్స్ కు ఇంటర్ బోర్డు ఓ పరీక్ష పెట్టింది. అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి చేయకుండానే, అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు రెండు శాతం కాలేజీలకే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. దీంతో ఏ కాలేజీకి గుర్తింపు ఉందో, దేనికి లేదో తెలియక పేరెంట్స్ అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మూడు వేలకు పైగా జూనియర్ కాలేజీలుండగా, వాటిలో ఏటా సుమారు 9.5 లక్షల మంది వరకూ చదువుతున్నారు.

2024–25 అకడమిక్ ఇయర్ లో కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే, సర్కారు కాలేజీలకు ఒకటి, రెండ్రోజుల్లో గుర్తింపు తప్పనిసరిగా వస్తుంది. కానీ, ప్రైవేటు కాలేజీల విషయంలోనే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో గతేడాది 1,424  ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇచ్చింది. వచ్చే 2024–25కు గానూ కాలేజీల అఫిలియేషన్లు, అడిషనల్ సెక్షన్ల కోసం మేనేజ్​మెంట్ల నుంచి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తులు స్వీకరించారు.

రూ.20 వేల ఫైన్ తో ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. అయితే, ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్లు ఇవ్వకుండానే, వారం రోజుల క్రితం ఇంటర్ బోర్డు అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 9 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూన్ 1 నుంచి క్లాసులు ప్రారంభించాలని కాలేజీలకు తెలిపింది.

గుర్తింపున్న కాలేజీలేవీ?

ఇంటర్ బోర్డు వెబ్ సైట్ చూసి గుర్తింపున్న కాలేజీల్లోనే చేరాలని అధికారులు పేరెంట్స్, స్టూడెంట్లకు సలహాలు ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో గతేడాది గుర్తింపు పొందిన 1,424 ప్రైవేటు కాలేజీలకు గానూ.. సోమవారం రాత్రి వరకూ కేవలం 25 కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చినట్టు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. దీనిలో అత్యధిక కాలేజీలున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్క కాలేజీకి కూడా ఇంకా గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పటివరకూ గుర్తింపు ఇచ్చిన వాటిలో మేడ్చల్ జిల్లాకు చెందిన 11 కాలేజీలుండగా, వాటిలో ఒక్కటీ కార్పొరేట్ కాలేజీ లేదు.

ఆదిలాబాద్ రెండు, వరంగల్1, మహబూబాబాద్ 4, వనపర్తి మూడు, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, వికారా బాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అయితే, వాస్తవానికి ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో అఫిలియేషన్ ఉన్న కాలేజీల వివరాలను అడ్మిషన్ నోటిఫికేషన్ సమయంలోనే ఇస్తే.. కొంత క్లారిటీ ఉండేదని పేరెంట్స్ చెప్తున్నారు.

ఏ కాలేజీకి పోయినా.. తమకు గుర్తింపు ఉందనే చెప్తున్నారని పేర్కొంటున్నారు. మరోపక్క సర్కార్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలకూ పూర్తిస్థాయి గుర్తింపు ఇవ్వలేదు. 408 సర్కారు కాలేజీలకు 388 కాలేజీల పేర్లనే వెబ్ సైట్ లో పెట్టారు. మిగిలిన కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఇతర గురుకుల కాలేజీలకూ పూర్తిస్థాయిలో అఫిలియేషన్లు ఇవ్వకపోవడం గమనార్హం. 

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ కాలేజీ లిస్టు బయటపెట్టలె..

రాష్ట్రంలో 400కు పైగా ప్రైవేటు కాలేజీలు మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఆయా కాలేజీలకు ఇచ్చిన రెండేండ్ల స్పెషల్ పర్మిషన్ పూర్తయింది. 2024–25 సంవత్సరంలో ఆయా కాలేజీలకు గుర్తింపు లేనట్టే. అయితే, ప్రస్తుతం మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న కాలేజీల వివరాలను బహిర్గతం చేస్తే, పేరెంట్స్ వారి పిల్లలను వాటిలో చేర్చించబోరు.

కానీ, ఇంటర్ బోర్డు ఆ పనిచేయడం లేదు. ఇప్పటికైనా ఇంటర్ బోర్డు అధికారులు గుర్తింపు ఉన్న కాలేజీల వివరాలను ప్రకటించాలని, అప్పటి వరకూ అడ్మిషన్ల ప్రక్రియను ఆపాలని స్టూడెంట్ యూనియన్లు కోరుతున్నాయి. లేకపోతే గుర్తింపులేని కాలేజీల్లో చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సాధ్యమైనంత త్వరగా అఫిలియేషన్లు ఇస్తామని ఇంటర్ బోర్డు 
ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.