వెలుగు ఓపెన్ పేజీ: మూడు కర్తవ్యాల బడ్జెట్ !

వెలుగు ఓపెన్ పేజీ:  మూడు కర్తవ్యాల బడ్జెట్ !

కేంద్ర  ప్రభుత్వం కేవలం  తక్షణ ఉపశమనాల  కంటే  దీర్ఘకాలిక  మౌలిక  సదుపాయాల కల్పనకే  మొగ్గు చూపుతోంది.  తాజా 2026-27 బడ్జెట్ విషయానికి వస్తే, ఇది  'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని చేరుకోవడానికి  గట్టి పునాదిగా కనిపిస్తోంది. 

ఈ బడ్జెట్‌‌ను మూడు ప్రధాన ‘కర్తవ్యాల’

ప్రాతిపదికన రూపొందించారు.  1. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. మౌలిక సదుపాయాలు,  తయారీ రంగాన్ని బలోపేతం చేయడం.  2. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. యువత, పేదలు,  మహిళల సామర్థ్యాన్ని పెంచడం. 3. సమగ్ర అభివృద్ధి.  ప్రతి ప్రాంతం,  రంగానికి సమాన అవకాశాలు కల్పించడం.  ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో  ప్రవేశపెట్టిన  బడ్జెట్  గత పదేళ్ల మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రయాణానికి ఒక కొనసాగింపుగా కనిపిస్తోంది.  ద్రవ్యలోటును  జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యం ప్రభుత్వ ఆర్థిక పటిష్టతను చాటిచెబుతోంది.  ప్రభుత్వం తన 'గతి శక్తి' ప్రణాళికను మరింత వేగవంతం చేస్తోంది. మూలధన వ్యయాన్ని  రూ. 12.2 లక్షల కోట్లకు పెంచడం ద్వారా మౌలిక  సదుపాయాల కల్పనలో  వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది.  రవాణా రంగానికి రూ. 5.98 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 7 కొత్త  హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు.  హైదరాబాద్‌‌ను  అంతర్జాతీయ  ఫార్మా,  ఐటీ హబ్‌‌గా మార్చేలా కొత్త  కారిడార్లు,  సెమీ కండక్టర్ మిషన్ కింద కేటాయింపులు రాష్ట్ర పారిశ్రామికవృద్ధికి తోడ్పడతాయి.  దేశంలోని  ప్రధాన నగరాలను కలుపుతూ హైదరాబాద్​కు 3 హైస్పీడ్​  రైల్ కారిడార్లను ప్రకటించారు. 200 పారిశ్రామిక క్లస్టర్ల ఆధునీకరణకు,  మూడు కొత్త  డెడికేటెడ్  కెమికల్ పార్కుల నిర్మాణానికి నిధులు కేటాయించారు.

ఆరెంజ్ ఎకానమీ

‘ఆరెంజ్ ఎకానమీ’  లేదా సృజనాత్మక ఆర్థికవ్యవస్థను ఈ బడ్జెట్ ఒక  ప్రధాన వృద్ధి ఇంజిన్‌‌గా  గుర్తించింది.  భారతదేశాన్ని  గ్లోబల్  కంటెంట్ హబ్‌‌గా మార్చడానికి ఏవీజీసీ  రంగానికి  పన్ను మినహాయింపులు,  ప్రోత్సాహకాలు ప్రకటించారు.  సృజనాత్మక రంగంలోని  స్టార్టప్‌‌ల కోసం 'క్రియేటివ్ ఫండ్'ను  ఏర్పాటు చేశారు. మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) నమోదును  సులభతరం చేయడం ద్వారా  గల్లీలోని  కళాకారుడి  ఆలోచన కూడా గ్లోబల్ మార్కెట్‌‌లో  అమ్ముడుపోయేలా  మార్గం  సుగమం చేసింది.  ఇది కేవలం ఉద్యోగాలు వెతుక్కునే యువతను ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇది ఫ్యాషన్, ఆర్కిటెక్చర్,  సాఫ్ట్‌‌వేర్  రంగాల్లోని  నవకల్పనలకు మద్దతు ఇస్తుంది.  యానిమేషన్,  విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్,  కామిక్స్ (ఏవీజీసీ) రంగానికి  ప్రత్యేక గుర్తింపునిస్తూ,  యువతకు డిజిటల్  ఉద్యోగ  అవకాశాలను  మెరుగుపరిచారు.  భారత్‌‌లోని  డేటా సెంటర్లను వాడుతూ ప్రపంచవ్యాప్తంగా  క్లౌడ్ సర్వీసెస్  అందించే  విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను సెలవు 
( ట్యాక్స్​హాలీడే) ప్రకటించారు.  ఇది  భారత్‌‌ను  క్లౌడ్ హబ్‌‌గా మారుస్తుంది.  

మందులపై  పన్ను మినహాయింపు

ఉత్తర భారతంలో నిమ్హాన్స్-2  ఇన్‌‌స్టిట్యూట్‌‌ను ఏర్పాటు చేయనున్నారు.  వెనకబడిన తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం దుర్గాపూర్  కేంద్రంగా ఇండస్ట్రియల్ కారిడార్, 4,000 ఈ-బస్సులను కేటాయించారు.  క్యాన్సర్  రోగుల కోసం వాడే 17 రకాల  ప్రాణాధార మందులపై  కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు.  అలాగే 7 రకాల అరుదైన వ్యాధులకు వాడే  మందులపై కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు.  రాబోయే 5 ఏళ్లలో 1 లక్ష మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్‌‌ను,  1.5 లక్షల మంది కేర్ గివర్స్‌‌ను సిద్ధం చేయనున్నారు.  3 కొత్త ఆయుర్వేద ఇన్‌‌స్టిట్యూట్‌‌లను  ఏర్పాటు చేయనున్నారు.  'దివ్యాంగ సహాయ యోజన' ద్వారా ఆధునిక పరికరాలను, 'కౌశల్ యోజన' ద్వారా ఐటీ,  హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి శిక్షణను దివ్యాంగుల కోసం అందిస్తారు.  ప్రతి జిల్లాలో అమ్మాయిల కోసం ఒక హాస్టల్ నిర్మించడంతోపాటు,  ఐదు 'యూనివర్సిటీ టౌన్‌‌షిప్'లను ఏర్పాటు చేయనున్నారు. ఖేలో ఇండియా మిషన్' ద్వారా క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయి శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.  విదేశీ టూర్ ప్యాకేజీలపై  టీసీఎస్  రేటును తగ్గించారు.  విదేశాల్లో చదువుకోవడానికి లేదా వైద్యం కోసం పంపే డబ్బుపై (ఎల్ఆర్ఎస్ కింద)  టీసీఎస్ 5% నుంచి 2%కి  తగ్గించారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం 'బ్యాగేజీ క్లియరెన్స్' నిబంధనలను సవరించారు. 

హై-వాల్యూ  అగ్రికల్చర్  పథకాలు

భారత్- విస్టా ఒక విప్లవాత్మక ఏఐ టూల్.  ఇది  అగ్రిస్టాక్  పోర్టల్స్,   ఐసీఏఆర్​ అందించే  వ్యవసాయ పద్ధతులను  అనుసంధానిస్తుంది.  దీనిద్వారా  ప్రతి రైతుకు వారి పొలానికి తగ్గట్టుగా వ్యక్తిగత సలహాలు, సూచనలు అందుతాయి, తద్వారా దిగుబడి పెరుగుతుంది.  మత్స్యకారుల కోసం 500 రిజర్వాయర్ల అభివృద్ధిని చేపట్టనున్నారు. పాడి పరిశ్రమ, పత్తి గింజల సరఫరా చేసే ప్రాథమిక సహకార సంఘాలకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. కొబ్బరి,  చందనం,  జీడిపప్పు వంటి పంటలను ప్రోత్సహించడానికి హై-వాల్యూ అగ్రికల్చర్ ప్రత్యేక పథకాలు తెచ్చారు. చేపల పెంపకాన్ని వృద్ధి చేయడానికై 500 జలాశయాలు 'అమృత్ సరోవర్ల' సమగ్ర అభివృద్ధిని చేపట్టనున్నారు. తీరప్రాంతాల్లో స్టార్టప్‌‌లు, మహిళా బృందాలు  'ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్'  భాగస్వామ్యంతో మత్స్య రంగ విలువను  పెంచుతారు. పశుపోషణ రంగంలో పారిశ్రామికవేత్తలను  ప్రోత్సహించడానికి 'క్రెడిట్- లింక్డ్  సబ్సిడీ  ప్రోగ్రామ్'  తెస్తారు.

అభివృద్ధి  పనులకు రికార్డు స్థాయిలో నిధులు

లిథియం - అయాన్ బ్యాటరీల తయారీకి వాడే యంత్రాలపై,  సోలార్ గ్లాస్ తయారీకి వాడే సోడియం యాంటిమోనేట్‌‌పై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. ఇది గ్రీన్ ఎనర్జీ దిశగా భారత్ అడుగులను వేగవంతం చేస్తుంది. సోలార్ గ్లాస్ తయారీలో వాడే సోడియం యాంటిమోనేట్ దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు.  పౌర విమానయానం, శిక్షణ, రక్షణ రంగాల్లో వాడే విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలు,  ముడి పదార్థాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. ద్రవ్య లోటును అదుపులో ఉంచుతూనే, భవిష్యత్ అవసరాలైన ఏఐ, న్యూక్లియర్ ఎనర్జీ,  స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా భారత్  ముందస్తు  ప్రణాళికతో  వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. 2026-27 బడ్జెట్  ఆర్థిక స్థిరత్వం,  దీర్ఘకాలిక వృద్ధికి మధ్య సమతుల్యతను సాధించేలా రూపొందించారు.  ద్రవ్యలోటును 4.3 శాతానికి  పరిమితం చేస్తూనే,  అభివృద్ధి  పనులకు రికార్డు స్థాయిలో నిధులు  కేటాయించడం  ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం. 

- చిట్టెడ్డి కృష్ణారెడ్డి,  
అసోసియేట్ ప్రొఫెసర్, 
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ