- కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు
- అకాల వర్షాలతో రైతుల్లో టెన్షన్. దీనిపై స్టోరీ సార్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన నిల్వ సదుపాయాలు లేక కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు రావడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. జిల్లాలోని 11 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 22 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సొసైటీల ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. కేంద్రాల వద్ద ఇంకా దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మక్కజొన్న నిల్వగా ఉంది.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మక్కలు నిల్వ చేయడానికి సరిపడ గోదాములు లేక మార్క్‌ఫెడ్, సొసైటీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డులోనే దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మక్కజొన్న నిల్వ ఉంది. జిల్లాలోని మార్కెట్ కమిటీల గోదాములు ఖాళీ లేకపోవడంతో కొంత మక్కజొన్నను నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తరలించారు. అక్కడ కూడా గోదాములు నిండిపోవడంతో లారీల్లో తీసుకెళ్లిన ధాన్యాన్ని దింపలేకపోతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దనే మక్కజొన్న నిల్వ చేయాల్సి వస్తోంది.
అకాల వర్షాలతో ఆందోళన
అకాల వర్షాలు రావడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన గోదాములు లేకపోవడంతో మక్కజొన్నను టార్పాలిన్‌లతో కప్పి ఉంచుతున్నారు. గురువారం రాత్రి వచ్చిన గాలి దుమారంతో టార్పాలిన్‌లు ఎగిరిపోవడంతో కొన్ని చోట్ల ధాన్యం తడిసింది. భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏమవుతుందోనని రైతులు భయపడుతున్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను పూర్తిగా తరలించే వరకు బాధ్యత రైతులదే కావడంతో వారు అక్కడే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు.
కొనుగోళ్లలో నిబంధనల ఇబ్బంది
కొనుగోళ్లలో విధించిన నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయి. ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కజొన్న మాత్రమే కొనుగోలు చేస్తామని సొసైటీలు చెబుతున్నాయి. అయితే ఈసారి ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. మిగిలిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మద్ధతు ధర ఉందని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే నిబంధనలు తమకు భారంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరిగా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.
అశ్వాపురం మండలంలో పలువురు రైతులకు పంటల నమోదు లేకపోవడంతో వారు పండించిన మక్కజొన్నను ప్రైవేటుగా విక్రయిస్తున్నారు. మొదట పత్తి సాగు చేసిన కొందరు రైతులు తర్వాత మక్కజొన్నకు మారారు. అయితే పంటల నమోదు సమయంలో పత్తి సాగు చేసినట్టుగా నమోదు కావడంతో కొనుగోలు కేంద్రాల్లో మక్కజొన్నను అధికారులు కొనడం లేదు. దీంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు కొనుగోలు కేంద్రాల నుంచి మక్కజొన్నను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మార్క్‌ఫెడ్ అధికారి నర్సింహరావు తెలిపారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల గోదాములకు పంపించినప్పటికీ అక్కడ కూడా నిల్వ సామర్థ్యం పూర్తిగా నిండిపోయిందని, అందువల్ల తరలింపులో కొంత ఇబ్బంది ఏర్పడుతోందని చెప్పారు.
