- ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 38 సీట్లు, జీవన్ రెడ్డి వర్గానికి 22 సీట్లు
- మున్సిపల్ టికెట్ల కేటాయింపుపై జీవన్‌రెడ్డి వర్గం అసంతృప్తి
జగిత్యాల, వెలుగు: మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో జగిత్యాల కాంగ్రెస్‌లో జగడం మరింత తీవ్రమైంది. నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కలిపి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 38 సీట్లు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వర్గానికి 22 సీట్లు కేటాయించడంతో సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ కండువా వేసుకున్న అసలు కార్యకర్తలను పక్కనబెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు ఇవ్వడంపై జీవన్‌రెడ్డి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఎటువంటి కోపం ఉన్నా నాపై తీర్చుకోండి.. కానీ కార్యకర్తలను అన్యాయానికి గురిచేయొద్దు’ అంటూ జీవన్‌రెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పదవులకు రాజీనామాలు
జగిత్యాల మున్సిపాలిటీలోని 50 వార్డుల్లో సంజయ్ కుమార్ వర్గానికి 30 మందికి, జీవన్‌రెడ్డి వర్గానికి 20 మందికి టికెట్లు దక్కాయి. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో ఎమ్మెల్యే వర్గానికి 8, మాజీ మంత్రి వర్గానికి 4 సీట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
టికెట్ కేటాయింపులో అన్యాయం చేశారంటూ రాయికల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని నాగరాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపాముల మమత తమ పదవులకు రాజీనామా చేశారు. రెండో వార్డు నుంచి బీఫాం పొందిన మేకల రమేశ్ కూడా పోటీకి నిరాకరించారు. వర్గపోరు, అన్యాయం కారణంగా బరిలో నిలబడటం సరికాదంటూ ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల అధికారుల ముందే బీఫామ్ చించివేత
కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి లిస్ట్‌లో 29వ వార్డు అభ్యర్థిగా జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన తోపారపు లావణ్య పేరు ఉంది. కొద్దిసేపటికే లిస్ట్‌లో మార్పులు చేసి ఎమ్మెల్యే వర్గానికి చెందిన అరుముళ్ల తేజస్విని పేరు ప్రకటించారు. ఇద్దరికీ బీఫాంలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తోపారపు లావణ్య పేరు బీఫామ్‌లో లేదంటూ తేజస్విని సోదరుడు పవన్ ఎన్నికల అధికారుల సమక్షంలో బీఫామ్‌ను చింపేసారు.
దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకోవడంతో తేజస్విని ఇండిపెండెంట్, లావణ్య కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జగిత్యాల మున్సిపాలిటీలో 26వ వార్డు బీఫామ్ వీరబత్తిని పద్మావతి(జీవన్ రెడ్డి వర్గం)కి కేటాయించారు. అనంతరం గొల్లపల్లి మాధవిలత(సంజయ్ వర్గం)కు కొత్త బీఫామ్ ఇచ్చారు. ఈ క్రమంలో వాగ్వాదం జరగగా.. ఆగ్రహించిన డీసీసీ అధ్యక్షుడు నందయ్య, పద్మావతి పేరుతో ఉన్న బీఫామ్‌ను అక్కడికక్కడే చింపేశారు.
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట భారీ బందోబస్తు
మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కావడంతో ఉదయం నుంచే జీవన్ రెడ్డి అనుచరులు సంజయ్ ఇంటిని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తత లేకపోవడంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్, నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
