రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని డీబీఏం 38 కెనాల్ గేట్ మంగళవారం లాక్ అయ్యింది. దీంతో కెనాల్ బ్యాక్ వాటర్ పరిసరాల్లోని పంట పొలాలు నీటితో నిండిపోయాయి. రేగొండ వద్ద డీబీఏం 38 కెనాల్ నుంచి భాగిర్థిపేట ఉప కాలువకు మళ్లించేందుకు ఆయకట్టు రైతులు తెల్లవారు జామున గేటును దించారు. ఉప కాలువ చెట్ల పొదలతో ఉండడంతో మెయిన్ కాల్వను బ్యాక్ వాటర్ ముంచేసింది.
కాల్వ పరిసరాల్లోని 20 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిరప పంట పొలాలతో పాటు ఇండ్లు నీటిలో మునిగాయి. లాక్ అయిన గేట్ ను ఓపెన్ చేసేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రయత్నం చేసినా గేట్ ఓపెన్ కాకపోవడంతో గేట్ చుట్టు ఉన్న కాంక్రీట్ దిమ్మలను తొలగించడంతో నీటి ప్రవాహం తగ్గింది. ఆఫీసర్ల నిర్లక్షంతో ఏండ్ల తరబడి ఎస్సారెస్పీ కాలువల గేట్లకు ఎలాంటి మెయింటనెన్స్ లేకపోవడంతో పంటలను కోల్పోవాల్సి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
