కాంగ్రెస్ ను గెలిపిస్తే అధిక నిధులు తీసుకొస్తా : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ ను గెలిపిస్తే అధిక నిధులు తీసుకొస్తా : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ ప్రజలతో తనకు విడదీయరాని ఆత్మీయబంధం ఉందని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి అధిక నిధులు తీసుకువస్తానన్నారు.  

మొదట చర్లపల్లి 15వ డివిజన్ అభ్యర్థి పెరిక నాగరాజు, మర్రిగూడ 14 డివిజన్ అభ్యర్థి బొజ్జ శంకరయ్య, 12వ డివిజన్ అభ్యర్థి మామిడి కార్తీక్, 27 డివిజన్ అభ్యర్థి సట్టు నాగమణి శంకర్, 28వ డివిజన్ అభ్యర్థి గుండెబోయిన పుష్పలత వెంకన్న, 29వ డివిజన్ అభ్యర్థి గులాబ్ మహమ్మద్ షఫిక్, 26వ డివిజన్ అభ్యర్థి అసిమా సుల్తాన్( బషీర్ ),30 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు.  నల్గొండనే తన ఇల్లు, కుటుంబం, ప్రాణమని పేద ప్రజల మధ్యే ఉండటం తనకు ఇష్టమన్నారు.

ప్రతీక్ పేరుతో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని తెలిపారు. పట్టణంలోని 18 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నల్గొండను హైదరాబాద్ తరహా నగరంగా తీర్చిదిద్దుతానన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొన్నారు.