బీసీ సబ్ ప్లాన్ కావాలి.. కులగణన వివరాలతో రెడీ చేయండి

బీసీ సబ్ ప్లాన్ కావాలి.. కులగణన వివరాలతో రెడీ చేయండి
  • జనాభా ప్రకారం బడ్జెట్ లోనిధులు కేటాయించాలి
  • ప్రభుత్వానికి బీసీ మేధావుల వినతి
  • మున్సిపల్ ఎన్నికల తర్వాత సీఎంను కలవనున్నట్లు వెల్లడి
  • పీసీసీ చీఫ్ కు సబ్ ప్లాన్ నమూనా అందజేత

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కోసం బీసీ సబ్ ప్లాన్ ను తప్పక తీసుకురావాలని ప్రభుత్వానికి వినతులు వెలువెత్తుతున్నాయి. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సబ్​ప్లాన్​కావాలని బీసీ సమాజం కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కులగణన చేపట్టి బీసీలు 56 శాతం ఉన్నట్లు తేల్చింది.

సమగ్ర కులగణన సర్వే ఆధారంగా ఏ కులం వారు ఎంత మంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటనే డేటాను మేధావులు రెడీ చేశారు. ఈ జనాభా దామాషా ప్రకారం.. వచ్చే నెలలో 2026–27 ఏడాదికి సర్కారు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని, వాటిని ఇతర స్కీంలకు మళ్లించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. బీసీల్లోని కులవృత్తులను ప్రోత్సహించడం, విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాల అమలుకు ఈ నిధులను నేరుగా ఖర్చు చేయడం ఈ సబ్ ప్లాన్ తో సాధ్యమవుతుందని చెబుతున్నారు. 2014లో రాష్ట్ర బడ్జెట్ ను 1,00,683 కోట్లతో ప్రవేశపెడితే అందులో బీసీలకు కేటాయించింది రూ.2,022 కోట్లు(కేవలం 2 శాతం), 2025–26 బడ్జెట్ ను రూ.3 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 2.4 శాతం నిధులే బీసీలకు కేటాయించారని పేర్కొంటున్నారు.

సబ్ ప్లాన్ తో బీసీల అభివృద్ధి

సబ్ ప్లాన్ వస్తే తమకు ఆర్థికంగా పెద్దపీట వేసినట్లవుతుందని బీసీ సమాజం అభిప్రాయపడుతున్నది. బీసీల్లో 130కి పైగా కులాలు ఉన్నప్పటికీ 4, 5 కులాల ప్రజలే ఎక్కువగా ఉండటం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, నిధులు, రాజకీయ పదవులన్నీ వాళ్లకే దక్కుతున్నాయని ఎంబీసీలు, ఇతర బీసీ కులాల నేతలు ఎన్నో ఏండ్లుగా ఆరోపిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా నిధులు, ప్రభుత్వ పథకాలు అన్ని కులాల ప్రజలకు దక్కాలంటే బీసీ సబ్ ప్లానే పరిష్కారమని చెబుతున్నారు.

44 పేజీల మోడల్ బీసీ సబ్ ప్లాన్ డాక్యుమెంట్

రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ తీసుకువచ్చి, అసెంబ్లీలో చట్టం చేయాలని సామాజిక తెలంగాణ మేధావుల ఫొరం ప్రెసిడెంట్ ప్రొఫెసర్ మురళీ మనోహర్, తెలంగాణ బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య, పీసీసీ ఓబీసీ సెల్​కన్వీనర్ కేతూరి వెంకటేశ్ ​కోరారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సబ్ ప్లాన్ తో కలిగే లాభాలపై 44 పేజీల మోడల్ బీసీ సబ్ ప్లాన్ డాక్యుమెంట్ ను ఆయనకు అందజేశారు. బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని, దీనిపై సీఎం రేవంత్​రెడ్డితో చర్చిస్తానని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత బీసీ మేధావులతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. తాము మున్సిపల్​ఎన్నికల తర్వాత సీఎంను కలుస్తామని తెలిపారు.

పదేండ్లు బీసీలకు అన్యాయం

బీసీ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించడం లేదు. గత ప్రభుత్వంలో పదేండ్లు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే చేసి, ఆ లెక్కలను బయటకు రాకుండా తొక్కిపెట్టారు. ఆ పాలనకు చెక్ పెట్టి కాంగ్రెస్​ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు కీలక పాత్ర పోషించాయి. ఎన్నికల ముందు చెప్పినట్లు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి.- దేవళ్ల సమ్మయ్య,బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్