హనుమకొండ, వెలుగు: భార్యను కాపురానికి పంపడం లేదని కక్షగట్టిన ఓ యువకుడు అత్త, బావమరిదిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. దర్గా కాజీపేటకు చెందిన కుడికాల అఖిల్, హనుమకొండలోని హంటర్ రోడ్డు శాయంపేటకు చెందిన సజ్విత ఇద్దరూ క్లాస్ మేట్స్ కాగా, దాదాపు ఐదేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రెండున్నరేండ్ల బాబు ఉన్నాడు. ఇదిలాఉంటే అఖిల్, సజ్విత మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తగా, తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల కిందట సజ్విత న్యూశాయంపేటలోని తల్లిగారింటికి వచ్చింది. అనంతరం హనుమకొండలోని మహిళా పీఎస్ లో అఖిల్ తోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది.
ఆ తర్వాత హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. దీంతో అఖిల్ తన భార్యను కాపురానికి పంపకుండా ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని కక్ష పెంచుకున్నాడు. గత వారం న్యూశాయంపేటకు వచ్చిన సజ్విత సోమవారం తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోగా, అదే రోజు రాత్రి అఖిల్ కత్తి తీసుకుని సజ్విత తల్లిగారింటికి వెళ్లాడు. అక్కడున్న సజ్విత తమ్ముడు రామన్ కుమార్ తో పాటు తల్లి సునీతపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు.
దీంతో వారు కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చేసరికి అఖిల్ పరారయ్యాడు. ఈ దాడిలో రామన్ కుమార్ తో పాటు సునీతకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే అంబులెన్స్ లో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సజ్విత తండ్రి రాజేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సుబేదారి పోలీసులు వివరించారు.
