- కాంగ్రెస్‌లో అధికంగా తిరుగుబాటుదారులు
- టికెట్ దక్కక అలకబూనిన బీజేపీ ఆశావహులు
- నేతలను భయపెడుతున్న ఇండిపెండెంట్ల పోటీ
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులకు ప్రధాన పార్టీలు బీఫారాలు అందజేసింది. బుజ్జగింపులు, భరోసా కల్పించినా ఆశావహులు ఒప్పుకోలేదు. కొందరు విత్‌డ్రా చేసుకోగా మరికొందరు ససేమీరా అనడం ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నేతల ప్రయత్నాలు విఫలమయ్యాయి.
బీజేపీ కొన్ని స్థానాలకు ఎంపిక చేసుకున్నప్పటికీ రెబల్స్బెడద తప్పలేదు. మజ్లిస్‌లో అభ్యర్థుల లిస్ట్ కూడా చివరి వరకు ఖరారు కాలేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆశావహులకు నచ్చజెప్పే పనిలో ముఖ్య నేతలు బిజీగా గడిపారు. పార్టీల ఆదేశాలను గౌరవించి కొందరు విత్‌డ్రా చేసుకోగా మరికొందరు రెబల్స్‌గా నిలబడ్డారు.
మున్సిపాలిటీల్లోనూ..
బోధన్‌లో 74 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా 38 వార్డుల నుంచి 162 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాలకు క్యాండిడేట్లను నిలబెట్టగా, బీజేపీ 22, మజ్లిస్ 25 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 38 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా, 153 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ 35 మందిని నిలబెట్టగలిగింది.
బీజేపీ 33 వార్డులు, మజ్లిస్ నాలుగు వార్డుల్లో క్యాండిడేట్స్‌కు బీఫారాలు ఇచ్చింది. భీంగల్‌లో 24 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా, 49 మంది బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా బీఎస్పీ 4, జనసేన ఇద్దరు, డీఎస్పీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు ఆరుగురు ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 92 వార్డులు ఉండగా, ఆయా పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి 447 మంది బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్అన్ని వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 89 వార్డుల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది. సీపీఎం 3, ఎంఐఎం 10, బీఎస్పీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 1, గుర్తింపు పొందిన పార్టీలు 18 మంది, ఇండిపెండెంట్లు 138 మంది ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 222 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.
కామారెడ్డి మున్సిపాలిటీలో..
కామారెడ్డి మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో 254 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 49, బీజేపీ 48, , బీఆర్ఎస్ 49 మంది పోటీలో ఉన్నారు. ఎంఐఎం 8 , సీపీఎం 3, ఇతర స్టేట్స్ రికగ్ననైజుడు పార్టీలు 14 మంది, ఇండిపెండెంట్లు 81 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ 82 మంది మాత్రమే విత్‌డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకున్న వారిలో కాంగ్రెస్ నుంచి 49 మంది, బీజేపీ 7, బీఆర్ఎస్ 16 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు. పలు చోట్ల ఆయా పార్టీల రెబల్స్ పోటీలో ఉన్నారు.
బాన్సువాడ మున్సిపాలిటీలో..
బాన్సువాడ మున్సిపాలిటీలోని19 వార్డులకు 85 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ 72 మంది తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 19, బీజేపీ 17 వార్డుల్లో పోటీ చేస్తుంది. ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 29 మంది ఉన్నారు. కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉన్నారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డులకుగాను 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 మంది నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీఎస్పీ 2, ఇండిపెండెంట్లు ఏడుగురు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ కు 3 వార్డుల్లో రెబల్స్
ఉన్నారు.
బిచ్కుంద మున్సిపాలిటీలో..
బిచ్కుంద మున్సిపాలిటీలోని 12 వార్డులకుగాను 63 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 43 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ 12 వార్డుల్లోనూ అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీఎస్పీ 1, ఎంఐఎం1, ఇతర స్టేట్స్ రికగ్ననైజుడు పార్టీల నుంచి 4, ఇండిపెండెంట్లు 21 మంది పోటీలో ఉన్నారు.
ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద..
జిల్లాలోన్ని అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పడం లేదు. కామారెడ్డిలో కాంగ్రెస్‌కు ఎక్కువ వార్డుల్లో రెబల్స్ బెడద ఉంది. బీజేపీ, బీఆర్ఎస్లకు కొన్ని చోట్ల రెబల్స్ ఉన్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిల్లో కూడా కాంగ్రెస్‌కు రెబల్స్ ఉన్నారు. చివరి నిమిషం వరకు విత్‌డ్రా చేసుకోవాలని ప్రధాన పార్టీల నేతలు సూచించినా ఒప్పుకోక ఇండిపెండెంట్లుగాd బరిలో నిలిచారు.
నిజామాబాద్ కార్పొరేషన్లో 298 నామినేషన్లు విత్‌డ్రా..
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో మంగళవారం 298 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అన్ని వార్డుల్లో అభ్యర్థులను బరిలో నిలుపగా, బీజేపీ 51, బీఆర్ఎస్ 58, మజ్లిస్ 21, జన సేన 11, ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జాగృతి అభ్యర్థులు 15 మంది, ఇండిపెండెట్స్ గా 108 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి రెబల్స్ అధిక సంఖ్యలో బరిలో ఉన్నారు. ప్రతి డివిజన్ నుంచి ఇండిపెండెంట్లు పోటీలో ఉండడం నేతలను కలవరపెడుతోంది.
