ఆగస్టు నెల డీఏపీ వెంటనే సరఫరా చేయాలి.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మంత్రి తుమ్మల లెటర్

ఆగస్టు నెల డీఏపీ వెంటనే సరఫరా చేయాలి.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు  మంత్రి తుమ్మల లెటర్

హైదరాబాద్, వెలుగు : వానాకాలం సీజన్‌‌లో తెలంగాణ రైతులకు డీఏపీ ఎరువుల కొరత తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు శుక్రవారం లెటర్​రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 50 శాతం వరి నాట్లు పూర్తయ్యాయని, మిగిలినవి ఆగస్టు నెలలో పూర్తికానున్న నేపథ్యంలో డీఏపీ అవసరం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 

ఏప్రిల్ నుంచి జులై వరకు రాష్ట్రానికి 2.20 లక్షల టన్నుల డీఏపీ కేటాయింపు ఉండగా, ఇప్పటివరకు 1.55 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయిందని, జులై 31 నాటికి రాష్ట్రంలో కేవలం 20 వేల టన్నుల డీఏపీ నిల్వలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. మరో వైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు అధికంగా డీఏపీ వినియోగానికే మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆగస్టు నెలకు 50 వేల టన్నులు, సెప్టెంబర్ నెలకు మరో 50 వేల టన్నుల డీఏపీని తెలంగాణకు కేటాయించాలని తుమ్మల నాగేశ్వరరావు కోరారు.