మావాళ్ల బాధలు ఎవరూ పట్టించుకోవట్లేదు..ప్రెస్ మీట్ లో ఢిల్లీ పోలీసు కుటుంబాల ఆవేదన

మావాళ్ల బాధలు ఎవరూ పట్టించుకోవట్లేదు..ప్రెస్ మీట్ లో  ఢిల్లీ పోలీసు కుటుంబాల ఆవేదన
  • రాజకీయ నేతలు మా గొంతు కూడా వినాలి
  • పోలీసులే క్రూరులు అన్నట్లు సోషల్​ మీడియాలో ప్రచారం

న్యూఢిల్లీ: నీట్‌‌ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద  జరిగిన ఆందోళన తీవ్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న భయాందోళనకర పరిస్థితిని, గాయపడిన తీరును చూసి పోలీసుల కుటుంబాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అమానుషంగా దాడి చేసి, సామాజిక మాధ్యమాల్లో వారిపైనే నెపం నెడుతున్నారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నిరసనల్లో అసాంఘిక శక్తులు చొరబడి ఖాకీ దుస్తులపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కాన్‌‌స్టిట్యూషన్ క్లబ్‌‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బాధిత పోలీసుల భార్యలు, పిల్లలు మాట్లాడారు. సోషల్ మీడియాలో పోలీసులు మాత్రమే క్రూరులన్నట్టు ఒకే వైపు కథనాన్ని ప్రచారం చేస్తున్నారని, తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించే పోలీసుల బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోయారు.  

నిరసనల్లో మరో కోణం కూడా చూడాలి

యూనిఫాం వెనుక కేవలం ఒక పోలీసు మాత్రమే లేడని, అతని వెనుక ఒక తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబం మొత్తం ఉంది అని పోలీసుల కుటుంబ సభ్యులు గుర్తు చేశారు. విద్యార్థుల ముసుగులో వచ్చిన అసాంఘిక శక్తులు రాళ్లు, చెప్పులు, పూల కుండీలతో పోలీసులపై దాడి చేశాయని పేర్కొన్నారు.   రాజకీయ నాయకులు తమ గొంతు కూడా వినాలని విజ్ఞప్తి చేశారు. ‘‘విద్యార్థుల నిరసనను పోలీసులు క్రూరంగా అణచివేశారని, విద్యార్థులను కొట్టారని మాత్రమే ప్రచారం జరుగుతోంది. 

కానీ అది నిజం కాదు. నిరసనకు సంబంధించిన ఒక కోణం మాత్రమే బయటకు కనిపిస్తున్నది. కానీ మరో వైపు ఉన్న వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ అంశంపై పార్లమెంటులో గళం ఎత్తాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నాం’’ అని విన్నవినంచారు. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన తరుణంలో, ఈ హింసపై పారదర్శకమైన విచారణ జరిపించాలని, విధుల్లో ఉన్న సిబ్బంది భద్రతపై పార్లమెంట్‌‌లో చర్చ జరగాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్‌‌తో పోలీసుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.