ముషీరాబాద్, వెలుగు: హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మీటర్ రీడర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత కోసం శాంక్షన్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జీతాలు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దేశపాక శ్రీనివాస్, ఉపేందర్‌రెడ్డి, రవి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
