ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో తేజ రకం మిర్చి రేటు క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం క్వింటాల్ మిర్చి రూ.23,350 పలికింది. ఇప్పటివరకు రూ.22 వేలకు దిగువనే రేటు ఉండగా.. గురువారం తొలిసారిగా జెండా పాటగా రూ.23,050 నమోదైంది. ఒక్క రోజులో మరో రూ. 300 పెరిగి శుక్రవారం రూ. 23,350కి చేరుకుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి సీజన్ అయిన మార్చి, ఏప్రిల్ లో సగటు ధర రూ.18 వేలుగా పలికింది. విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతుండడం, గతేడాది సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడులు లేకపోవడంతో మిర్చికి డిమాండ్పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, థాయ్ లాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
