హైదరాబాద్, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.105.44 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, విజయనగరం, కాకినాడలోని 10 ప్రాంతాలతోపాటు, కంపెనీ డైరెక్టర్ల ఇండ్లు ఆఫీసుల్లో శుక్రవారం సోదాలు నిర్వహించింది. కంపెనీ రికార్డులు, డాక్యుమెంట్లు, జిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
ఏపీలోని విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ డైరెక్టర్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెన్నై బ్రాంచ్‌లో ఫోర్జరీ పత్రాలతో లోన్ తీసుకున్నారు. తర్వాత లోన్‌గా తీసుకున్న నిధులను వ్యాపార అవసరాలకు వినియోగించడానికి బదులుగా ఇతర మార్గాలకు మళ్లించి దుర్వినియోగం చేశారు. బ్యాంకుకు బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యారు. ఈ మోసం వల్ల బ్యాంకుకు రూ.105.44 కోట్లు నష్టం వాటిల్లింది. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సీబీఐ జోనల్ ఆఫీస్ కేసు నమోదు చేసింది.
