ఇబ్రహీంపట్నం: డెలివరీ బాయ్ గా చేస్తూ చోరీలు

ఇబ్రహీంపట్నం: డెలివరీ బాయ్ గా చేస్తూ చోరీలు
  • అంతర్రాష్ట్ర దొంగ, బైక్​ దొంగల ముఠా అరెస్ట్​

ఇబ్రహీంపట్నం, వెలుగు: నగర శివార్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నేరస్తుడితో పాటు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ముఖేష్ చౌదరి(35) ప్రస్తుతం కేపీహెచ్‌బీలో ఉంటూ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గతంలో హార్డ్‌వేర్ దుకాణం నిర్వహించిన అతడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. 2024 నుంచి చోరీలు ప్రారంభించాడు. గతంలో పీడీ యాక్ట్ నమోదుకాగా, ఆదిభట్ల, హయాత్‌నగర్, కుషాయిగూడతో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 కేసులు ఉన్నాయి. 

తుర్కయాంజల్ సమీపంలోని మన్నెగూడ వద్ద అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న డబీర్‌పురాకు చెందిన సయ్యద్ ఖాసిం హుస్సేన్, బండ్లగూడకు చెందిన మహమ్మద్ కరీంను కూడా అరెస్టు చేశారు. ఖాసిం హుస్సేన్ గతంలో ఐదు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో పాటు మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ముగ్గురి నుంచి రెండు చోరీ కేసులకు సంబంధించిన సుమారు రూ.6.5 లక్షల విలువైన మూడు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, ఆరు బైక్​లు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.