Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా

Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా

త్రినయని (Trinayani) సీరియల్తో తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన నటి పవిత్ర జయరాం (Pavitra Jayaram). ఆదివారం (మే 12) బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా..ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో భర్త చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు.ఇక ఆమె మరణంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ఈ క్రమంలో ఆమె భర్త,నటుడు చల్లా చంద్రుగా పాపులర్ అయిన చంద్రకాంత్ (Chandrakanth) తన ఇన్‌స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు."ఇందులో తాను పవిత్రతో దిగిన చివరి ఫొటోను షేర్ చేస్తూ రాసిన పదాలు ప్రేక్షకులను మరింత కలిచి వేస్తోంది.

"పాపా నీతో దిగిన చివరి పిక్ రా..నువ్వు నన్ను ఒంటరివాడివి చేశావన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామా అని పిలువే ప్లీజ్..అంటూ తనలోని ఆవేదనని తెలియజేశాడు. అలాగే 'నా పవి ఇక లేదు. ప్లీజ్ మళ్లీ రావా" అనే క్యాప్షన్ తో చివరగా దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో భర్తతో కలిసి పవిత్ర ఎంతోహ్యాపీగా కనిపిస్తోంది. దీంతో తెలుగు, కన్నడ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ చంద్రకాంత్ కు ధైర్యం చెబుతున్నారు. 

అయితే..ఈ కారు ప్రమాదంలో నటుడు చంద్రు చేతికి మరియు తలకు కూడా గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూడా అతడు మీడియాకు వివరించే ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే "ఇక్కడ షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నాం. బెంగళూరులో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాం. అయితే నేను, పవి, ఆమె అక్క కూతురు కారులో వస్తున్నాం. డ్రైవర్ కూడా ఉండటంతో నేను నిద్రలోకి జారుకున్నాను.

అయితే అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేసింది. దీంతో మా డ్రైవర్ వెంటనే కుడివైపుకు తిప్పాడు. దీంతో కారు డివైడర్ ను తాకి ముందుభాగంలో విండ్ షీల్డ్ ముక్కలైపోయింది. ఈ ప్రమాదంలో నాకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదు. అది చూసి పవిత్ర ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే ఆమెకు స్ట్రోక్ వచ్చి పూర్తిగా స్పృహ కోల్పోయింది. మేము హాస్పిటల్ కు వచ్చే సరికి ఒంటి గంట అయింది. ఉదయం 4 గంటల సమయంలో నాకు స్పృహ రాగా చూసేసరికి ఆమె చనిపోయిందని తెలిసింది" అని చంద్రకాంత్ వివరించాడు.

ఇక పవిత్ర జయరామ్ విషయానికి వస్తే..కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. అలా కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె.. త్రినయని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం అలరించారు. ఇక పవిత్ర జయరామ్ మరణవార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.