మాతృత్వం అనేది కేవలం బయోలాజికల్ మాత్రమే కాదని, పిల్లలను దత్తత తీసుకున్న తల్లులకు కూడా సమానమైన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 3 నెలల కంటే ఎక్కువ వయసున్న బిడ్డను దత్తత తీసుకున్నారనే కారణంతో ఏ తల్లికీ ప్రసూతి సెలవులను నిరాకరించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సామాజిక భద్రతా కోడ్-2020లోని రూల్స్ ప్రకారం కేవలం 3 నెలల లోపు వయసున్న బిడ్డను దత్తత తీసుకుంటేనే 12 వారాల సెలవులకు అర్హులన్నది రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది సుప్రీం ధర్మాసనం.
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ బెంచ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక కుటుంబాన్ని కేవలం రక్తం పంచుకుని పుట్టిన పిల్లలతోనే నిర్వచించలేమని, దత్తత అనేది కూడా అంతే సమానమైన, చట్టబద్ధమైన మార్గమని పేర్కొంది. మాతృత్వ రక్షణ అనేది ప్రాథమిక మానవ హక్కు అని, బిడ్డ వయసుతో సంబంధం లేకుండా దత్తత తీసుకున్న తల్లికి 12 వారాల ప్రసూతి ప్రయోజనాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. బిడ్డను తల్లికి అప్పగించిన రోజు నుంచే ఈ సెలవుల రూల్స్ వర్తిస్తాయని పేర్కొంది.
ALSO READ : ఉగాది పండుగ.. సంప్రదాయ వంటకాలు..
అంతేకాకుండా దత్తత తీసుకున్న బిడ్డ, కన్నబిడ్డ మధ్య ఎలాంటి తేడా లేదని న్యాయమూర్తులు నొక్కి చెప్పారు. కేవలం బయోలాజికల్ అంశాలే కుటుంబాన్ని నిర్ణయించవని, ప్రేమ.. బంధం ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యతను కూడా గుర్తిస్తూ, పురుషులకు 'పితృత్వ సెలవులు' ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు సూచించింది. న్యాయవాది హంసానందిని నందూరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వేలాది మంది దత్తత తీసుకున్న తల్లులకు పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు.
