ఉగాది పండుగ అంటే నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం. ఈ రోజున కేవలం షడ్రుచుల పచ్చడి మాత్రమే కాకుండా.. మరిన్ని రుచికరమైన వంటకాలను కూడా ట్రై చేయవచ్చు. ఇందుకోసం కొన్ని సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేసుకోండి. మరీ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు.. సజ్జల బూరెలు తయారీ ఏమేం కావాలి.. ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సినవి
- మినప్పప్పు: ఒక కప్పు
- బియ్యప్పిండి: రెండు కప్పులు
- ఉప్పు: చిటికెడు
- నూనె: వేగించడానికి సరిపడా
- బెల్లం తురుము: ఒక కప్పు
- కాజు: పావు కప్పు
- పచ్చి కొబ్బరి తురుము: మూడు కప్పులు
- నీళ్లు: తగినన్ని
- యాలకుల పొడి: అర టీ స్పూన్
కొబ్బరి బూరెలు తయారీ విధానం
పొడి మినప్పప్పును మెత్తగా పిండి పట్టుకోవాలి. తర్వాత జల్లించుకుని ఒక బౌల్లో పోసుకోవాలి. ఇందులోనే రెండు కప్పుల పొడి బియ్యప్పిండి, చిటికెడు ఉప్పు వేయాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలిపి రెండు గంటల పాటు పక్కనపెట్టాలి.
స్టవ్ పై ఒక మూకుడు పెట్టి అందులో బెల్లం, మూడు కప్పుల కొబ్బరి తురుము కూడా వేసి రెండింటినీ బాగా కలపాలి. పాకం దగ్గరపడ్డాక కాజు వేసి బాగా కలిపి స్టవ్ ఆపాలి.
తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి మరోమారు కలపాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలిపి, చిన్నచిన్న ఉండలు చేసుకోవాలి.
నానబెట్టిన పిండిలో కొన్ని నీళ్లుపోసి జారుగా చేసుకోవాలి. కొబ్బరి - బెల్లం ఉండలను ఈ పిండిలో ముంచి, నూనెలో వేగించాలి. ఎర్రగా వేగాక తీస్తే కొబ్బరి బూరెలు రెడీ
సజ్జల బూరెలు తయారీకి కావలసినవి
- సజ్జలు : ఒక కిలో
- బెల్లం తురుము : అరకిలో
- నువ్వులు: పావు కప్పు
- ఇలాచీ పొడి: అర టీ స్పూన్
- ఎండు కొబ్బరి పొడి: పావు కప్పు
- సాబుదానా (సగ్గుబియ్యం) :ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: తగినంత
- నెయ్యి లేదా నూనె : సరిపడా
సజ్జల బూరెలు తయారీ విధానం
సజ్జలు, సాబుదానా కలిపి మెత్తగా పిండి పట్టాలి. బెల్లం తురుమును నీళ్లలో కొద్ది సేపు నానబెట్టాలి తర్వాత సజ్జ పిండిలో ఈ బెల్లం నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత దాంట్లో ఎండు కొబ్బరిపొడి, దోరగా వేయించిన నువ్వులు ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి.
ఆపైన పిండిని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. వాటిని చేతుల్లోకి తీసుకుని బూరెలుగా వత్తాలి తర్వాత స్టన్లైన్లో నెయ్యి వేసి లేదా నూనె వేడి చేయాలి.
ఒకేసారి రెండు, మూడు బూరెలను డీప్ ఫ్రై చేసుకుంటే సరి పండుగ పూట సజ్జ బూరెలు తింటే స్పెషల్ గా ఉంటుంది
