శ్రావణ మాసం వచ్చిందంటే శివారాధనతో ఆలయాలు మర్మోగుతుంటారు. శివుడిని పూజించేందుకు అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణ మాసం వస్తున్న సందర్భంగా.. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న టెంపుల్ భక్తులను ఆకట్టుకుంటోంది.
ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో ఉన్న పురాతన గౌరీ శంకర్ ఆలయంలో శ్రావణ మాసంలో ఉదయం నుంచి అర్ధరాత్రి ఆలయం కిటకిటలాడుతుంటుంది. ఒకేచోట 12 జ్యోతిర్లింగాల దర్శనం కలుగుతుండటంతో.. భక్తులు జలాభిషేకం చేయడానికి, రుద్రాభిషేకం చేయడానికి , ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనడానికి తరలివస్తుంటారు.
హర్ హర్ మహాదేవ్ అనే మంత్రోచ్ఛరణల మధ్య, శ్రావణ మాసంలో ఢిల్లీలో ఉన్న ఆలయం ప్రత్యేక సందడిగా మారుతుంది. సాధారణ పూజలతో పాటు దర్శనానికి ప్రత్యేకత కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన భస్మ హారతి ఒకటి కాగా.. ఒకే ఆలయంలో కొలువుదీరిన 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాల దర్శనం కూడా స్పెషల్.
ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయం 800 సంవత్సరాల పురాతనమైనదని నమ్ముతారు. ఈ ఆలయానికి మతపరమైన , చారిత్రక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇక్కడ శివుడిని ప్రార్థించడం వల్ల తమ కోరికలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు.
ఇక్కడికి వచ్చే భక్తులు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు. హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. శ్రావణ మాసంలో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
గౌరీ శంకర్ ఆలయంలోని శ్రావణ మాసంలో ఒక ముఖ్యమైన ఆకర్షణ దాని భస్మ హారతి. ఇది ఉజ్జయిన్‌లోని మహాకాల్ ఆలయంలో అనుసరించే సంప్రదాయం నుంచి ప్రేరణ పొంది ఇక్కడ ఆచరిస్తున్నారు.
అయితే, ఈ భస్మ హారతిలో రెండింటికీ ఒక తేడా ఉంది. ఢిల్లీ ఆలయంలో ఈ ఆచారం కోసం స్మశానం నుంచి తెచ్చిన బూడిదను ఉపయోగించరు. దానికి బదులుగా, ఎండబెట్టిన ఆవు పేడ పిడకల నుండి తయారుచేసిన పవిత్రమైన బూడిదను వాడతారు.
హారతి ఉదయం జరుగుతుంది, ఇందులో పాల్గొనడానికి భక్తులు తెల్లవారుజామున నుంచే రావడం ప్రారంభిస్తారు. డమరుకం, గంటల శబ్దాలు, వేద మంత్రాల పఠనంతో కూడిన ఈ వేడుక శ్రావణ మాసంలో ఆలయంలోని అత్యంత ముఖ్యమైనదని నమ్ముతారు.
12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఒకే చోట:
ఈ ఆలయపు నేలమాళిగలో మరో విశిష్టత ఉంది, అక్కడ 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ప్రతిష్టించారు. భారతదేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న జ్యోతిర్లింగ ఆలయాలకు ప్రయాణించలేని భక్తుల కోసం, ఈ ప్రదేశం సోమనాథ్, మహాకాల్, కాశీ విశ్వనాథ్, కేదార్‌నాథ్, రామేశ్వరం, ఓంకారేశ్వర్‌లతో పాటు ఇతర జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఒకే చోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
శ్రావణ మాసంలో, చాలా మంది భక్తులు మొదట గౌరీ శంకర్‌కు పూజలు చేసి, ఆ తర్వాత క్రింది అంతస్తులో ఉన్న 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాల పూజలకు వెళ్తారు.
