తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్.. నెల రోజుల్లో 6,307 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్.. నెల రోజుల్లో 6,307 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థ,  బాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'ఆపరేషన్ ముస్కాన్-12  విజయవంతమైంది. కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 6,307 మంది చిన్నారులను రక్షించి, వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ భారీ ఆపరేషన్‌ను కొనసాగించారు. ఈ నెల రోజుల్లో గుర్తించిన 6,307 మందిలో.. ఏకంగా 5,041 మంది బాల కార్మికులు ఉండటం గమనార్హం. ఇందులో ఇతర రాష్ట్రాలు , నేపాల్‌కు చెందిన 2,860 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పిల్లలతో పని చేయిస్తున్న యజమానులపై 1,705 కేసులు నమోదు చేసి, 1,710 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 1,381 లేబర్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టులు జారీ చేసి, నిందితులకు రూ. 37.95 లక్షల జరిమానా విధించారు.

రక్షించిన చిన్నారుల్లో 5,737 మందిని వారి కుటుంబాలతో సురక్షితంగా పునఃకలపగా.. ఆశ్రయం లేని మరో 570 మందికి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో ఆశ్రయం కల్పించారు. చిన్నారుల భవిష్యత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సామాజిక కార్యక్రమాలు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాయి.