సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళనాట రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు రేగుతున్నాయి. ఇటీవల తమిళగ వెట్రి కజగం ( TVK ) జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తోపాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదంపై రజనీకాంత్ స్పందిస్తూ.. తనదైన శైలిలో ఘాటులో కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఆధవ్ అర్జున వ్యాఖ్యలేంటి?
మార్చి 12, 2026న చెన్నైలో TVK నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. "రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకున్నది డీఎంకే కుటుంబమే. ఆయనను బెదిరించి మరీ వెనక్కి తగ్గేలా చేశారు అని సంచలన ఆరోపణలు చేశారు. రజనీకాంత్ రాజకీయ విరమణ వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఎన్నో ఆశలతో ఎదురుచూసిన అభిమానులకు రజనీకాంత్ తీవ్ర నిరాశపరిచారని పేర్కొన్నారు.
కాలమే సమాధానం చెబుతుంది..
ఆధవ్ అర్జున వ్యాఖ్యలపై రజనీకాంత్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన మాటలు అవాస్తవమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు అని ఆయన కొట్టిపారేశారు. "కాలం మాట్లాడదు.. కానీ అది వేచి చూసి సరైన సమాధానం చెబుతుంది." తనకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, అన్నామలై, తిరుమావళవన్ లకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం రాజకీయ నేతలే కాకుండా సినీ ప్రముఖులు, మీడియా మిత్రులు కూడా ఆధవ్ వ్యాఖ్యలను ఖండించడాన్ని ఆయన స్వాగతించారు.
గతంలో ఏం జరిగింది?
నిజానికి రజనీకాంత్ రాజకీయ ప్రయాణం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ వంటిది. డిసెంబర్ 3, 2020: కొత్త పార్టీ పెడుతున్నట్లు, జనవరిలో ప్రకటిస్తానని రజనీ స్వయంగా ప్రకటించారు. అదే నెల చివరలో మూడు పేజీల లేఖ విడుదల చేస్తూ, కరోనా మహమ్మారి వల్ల తన అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పుడు రజనీ ప్రకటన అభిమానుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఎందుకు ఇంత రచ్చ?
తమిళనాడులో రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ సుమారు 30% నుండి 40% ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలదని అంచనా. అందుకే విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ రజనీ వైపు ఉన్న ఓటర్లను ఆకర్షించే క్రమంలో డీఎంకేపై ఈ అస్త్రాన్ని ప్రయోగించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అభిమానులు సహించబోరని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ హెచ్చరించారు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కుతుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న రజనీకాంత్ పై విమర్శలు చేయడం ఆయన ఫ్యాన్స్ సహించలేకపోతున్నారు. ఆధవ్ అర్జున తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని రజనీకి క్షమాపణ చెప్పాలని రజనీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
— Rajinikanth (@rajinikanth) March 17, 2026
