2–0తో సిరీస్‌‌ క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన టీమిండియా

2–0తో సిరీస్‌‌ క్లీన్‌‌స్వీప్‌‌ చేసిన టీమిండియా

డబ్లిన్‌‌: అనామకులు అనుకున్న ఐర్లాండ్‌‌ ఆటగాళ్లు ఇండియాను వణికించారు. 226 పరుగుల భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో విజయానికి చేరువగా వచ్చి హార్దిక్‌‌ సేనను ఓడించినంత పని చేశారు. ఆఖరి ఓవర్లో ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ (1/41) అద్భుతంగా బౌలింగ్‌‌ చేయడంతో  చిన్న జట్టు చేతిలో ఇండియా అవమానం తప్పించుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో, చివరి టీ20లో నాలుగు పరుగుల తేడాతో ఐర్లాండ్‌‌పై గెలిచిన హార్దిక్‌‌సేన సిరీస్‌‌ను 2–0తో క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది. టీమిండియాలో చోటు ఆశిస్తున్న దీపక్‌‌ హుడా (57 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) సెంచరీ,  సంజూ శాంసన్‌‌ (42 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 77)తో రెచ్చిపోవడంతో టాస్‌‌ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోరు చేసింది. హుడా, శాంసన్‌‌ రెండో వికెట్‌‌కు 87 బాల్స్‌‌లో 176 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ చేశారు. ఈ ఫార్మాట్‌‌లో ఇండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ క్రమంలో హుడా 55 బాల్స్‌‌లోనే వంద మార్కు దాటాడు. ఇండియా తరఫున ఈ ఫార్మాట్‌‌లో  రైనా, రోహిత్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ తర్వాత సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌‌గా  నిలిచాడు. ఇక, చివర్లో పుంజుకున్న ఐర్లాండ్‌‌ బౌలర్లలో అడైర్‌‌ (3/42), జోష్‌‌ లిటిల్‌‌ (2/38), క్రెయిగ్‌‌ యంగ్‌‌ (2/35) రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌కు వచ్చిన ఐర్లాండ్‌‌ ఓవర్లన్నీ ఆడి 221/5 స్కోరు చేసి ఓడిపోయింది.  కెప్టెన్‌‌ ఆండీ బల్బర్నీ (37 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 60), పాల్‌‌ స్టిర్లింగ్‌‌ (18 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 40)తో పాటు చివర్లో డాక్‌‌రెల్‌‌ (16 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్‌‌) ఇండియాను వణికించాడు. భువీ, హర్షల్‌‌, బిష్నోయ్‌‌, ఉమ్రాన్‌‌ తలో వికెట్‌‌ పడగొట్టారు.

దంచుడే దంచుడు

గత మ్యాచ్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చి హిట్టయిన హుడా ఈ సారి తన విశ్వరూపం చూపెట్టాడు. అతనికి శాంసన్‌‌ తోడవడంతో స్కోరుబోర్డు జెట్‌‌ స్పీడుతో దూసుకెళ్లింది. అయితే, మరో ఓపెనర్‌‌ ఇషాన్‌‌ కిషన్‌‌ (3)ను మూడో ఓవర్లోనై అడైర్‌‌ ఔట్‌‌ చేసి హోమ్‌‌ టీమ్‌‌కు బ్రేక్‌‌ ఇచ్చాడు. హుడా అదే ఓవర్లో సిక్స్‌‌ కొట్టి తన ఉద్దేశం ఏంటో స్పష్టం చేశాడు. తను ఎనిమిదో ఓవర్లో ఇచ్చిన క్యాచ్‌‌ను స్టిర్లింగ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న దీపక్‌‌, శాంసన్‌‌తో కలిసి అద్భుతమైన గ్రౌండ్‌‌ షాట్స్‌‌తో పాటు సిక్సర్లతో అలరించాడు. ఈ క్రమంలో 27 బాల్స్‌‌లోనే తను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆపై, శాంసన్‌‌ కూడా టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చాడు. డెన్లీ బౌలింగ్‌‌లో ఫోర్‌‌ కొట్టి టీ20ల్లో తొలి హాఫ్‌‌  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఇక, 90ల్లోకి వచ్చిన తర్వాత హుడా నెమ్మదించగా.. శాంసన్‌‌ మరింత రెచ్చిపోయాడు. డెలానీ వేసిన 15వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. అడైర్‌‌ ఓవర్లో ఇంకో సిక్స్‌‌ కొట్టిన తను తర్వాతి బాల్‌‌కే ఔటవడంతో ఐర్లాండ్‌‌కు ఊరట లభించింది. అప్పటికే స్కోరు 200 దాటగా..  18వ ఓవర్లో సింగిల్‌‌తో హుడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, వచ్చీరాగానే సిక్స్‌‌, రెండు ఫోర్లు కొట్టిన సూర్యకుమార్‌‌ (15)తో పాటు హుడాను లిటిల్‌‌ ఔట్‌‌ చేయగా.. 19వ ఓవర్లో కార్తీక్‌‌ (0), అక్షర్‌‌ (0)ను క్రెయిగ్‌‌ యంగ్‌‌ డకౌట్‌‌ చేశాడు. చివరి ఓవర్లో హార్దిక్‌‌ (13 నాటౌట్‌‌) ఒకే ఫోర్‌‌ రాబట్టాడు.  

వాళ్లూ అదే జోరు

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఐర్లాండ్‌‌ ఓపెనర్లు ఇండియాను వణికించారు. భువీ వేసిన తొలి ఓవర్లోనే స్టిర్లింగ్‌‌ వరుసగా 6, 4, 4, 4తో రెచ్చిపోయాడు. ఆపై, బల్బర్నీ వెంటవెంటనే నాలుగు సిక్సర్లు బాదడంతో ఐర్లాండ్‌‌ ఐదు ఓవర్లలోనే 65/0తో నిలిచింది. అయితే, ఆరో ఓవర్లో గుడ్‌‌లెంగ్త్‌‌ బాల్‌‌తో స్టిర్లింగ్‌‌ను ఔట్‌‌ చేసిన బిష్నోయ్‌‌ ఈ జోడీని విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే పాండ్యా కొట్టిన త్రో కు డెలానీ(0) రనౌటయ్యాడు. ఇక, బిష్నోయ్‌‌ వేసిన  ఎనిమిదో ఓవర్లో బల్బర్నీ  స్టంపౌటైనా.. అది నోబాల్‌‌ కావడంతో  అతనికి లైఫ్‌‌ దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న  బల్బర్నీ తొమ్మిది ఓవర్లలోనే స్కోరు వంద దాటించాడు.  34 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఓ వైడ్ షార్ట్‌‌బాల్‌‌తో హర్షల్‌‌  అతడిని బోల్తా కొట్టించాడు. కొద్దిసేపటికే ఉమ్రాన్‌‌ బౌలింగ్‌‌లో టక్కర్‌‌ (5) ఔటవడంతో మ్యాచ్‌‌ ఇండియా చేతుల్లోకి వచ్చినట్టు అనిపించింది. కానీ, ఈ టైమ్‌‌లో తొలి మ్యాచ్‌‌ హీరో హ్యారీ టెక్టర్‌‌ (39)కు తోడైన  డాక్‌‌రెల్‌‌ వరుస బౌండ్రీలతో  లక్ష్యాన్ని కరిగించారు. 18 బాల్స్‌‌లో ఐర్లాండ్‌‌కు 37 రన్స్‌‌ అవసరం అవగా... మ్యాచ్‌‌లో టెన్షన్‌‌ పెరిగింది. ఈ దశలో టెక్టర్‌‌ను ఔట్‌‌ చేసిన భువీ ఏడు రన్సే ఇచ్చాడు. కానీ, 19వ ఓవర్లో అడైర్‌‌ (12 బాల్స్‌‌లో 23  నాటౌట్‌‌) 4, 6 సహా 14 రన్స్‌‌ రాబట్టాడు. దాంతో, సమీకరణం 6 బాల్స్‌‌లో 17 రన్స్‌‌గా మారింది. ఆఖరి ఓవర్‌‌ తొలి బాల్‌‌కు పరుగివ్వని ఉమ్రాన్‌‌ తర్వాత నోబాల్‌‌ వేశాడు. తర్వాత రెండు ఫోర్లు వచ్చినా... ఆఖరి మూడు బాల్స్‌‌కు మూడు పరుగులే ఇచ్చిన ఉమ్రాన్‌‌ ఇండియాను గెలిపించాడు. 


సంక్షిప్త స్కోర్లు: 
ఇండియా: 20 ఓవర్లలో 225/7 (హుడా 104, శాంసన్‌‌ 77, అడైర్‌‌ 3/42).
ఐర్లాండ్‌‌: 20 ఓవర్లలో 221/5 (బల్బర్నీ 60, స్టిర్లింగ్‌‌ 40, బిష్నోయ్‌‌ 1/41)