బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌.. ట్రెండింగ్లో ఆశిష్ నెహ్రా

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌.. ట్రెండింగ్లో ఆశిష్ నెహ్రా

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.  బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకోనున్న తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగానే కాకుండా, అతిపిన్న బ్రిటన్‌ ప్రధానిగానూ రిషి సునాక్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే నెటిజన్లు రిషి సునాక్ తో పాటుగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రాకు కూడా  కంగ్రాట్స్ చెబుతున్నారు. ఎందుకంటే రిషి, నెహ్రా చూడటానికి దాదాపుగా ఒకేలా ఉంటారు కాబట్టి. దీంతో వీరిద్దరి పాత ఫొటోలను సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ "కంగ్రాట్స్  నెహ్రా భయ్యా... మీరు బ్రిటన్ ప్రధాని  అయ్యారు " అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆశిశ్ నెహ్రా హ్యాష్ ట్యాగ్  ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. 

గతంలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌పై పోటీచేసి ఓటమిపాలైన  రిషి సునాక్..   కొద్ది వారాల్లోనే బ్రిటన్ లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఏకగ్రీవంగా ప్రధాని పదవికి ఎన్నికై బ్రిటన్‌ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించారు. అక్టోబర్ 28 న రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చెపట్టనున్నారు. 29న ఆయన మంత్రివర్గం కొలువుదీరనుంది. 

రిషి సునాక్ నేపథ్యం 

రిషి సునాక్ పేరెంట్స్ పేరు యశ్విర్, ఉషా సునాక్. 1950వ దశకంలో వారు ఇండియా నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ ఫార్మసిస్టులుగా స్థిరపడ్డారు. అయితే మెరుగైన ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ.. వారు 1960వ దశకంలో బ్రిటన్ లోకి అడుగుపెట్టారు. సౌతాంప్టన్ నగరంలో ఉండగా యశ్విర్, ఉషా సునాక్ దంపతులకు 1980 మే 12న రిషి  జన్మించారు.  రిషి విద్యాభ్యాసం  చాలావరకు బ్రిటన్ లోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క.