ఆటోపై తోట : చల్లగా ప్రయాణించండి

ఆటోపై తోట : చల్లగా ప్రయాణించండి

ఎండాకాలం మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఓ సారి ఆలోచించాల్సిందే. బయట ఉండే వేడి తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేస్తుంటారు చాలామంది. ఏసీ కార్లు, ఏసీ బస్సుల్లో ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే… ఏసీ వాహనాలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటిలో జర్నీ కూడా కాస్ట్ లీ. ఆటోలో వెళ్లాలన్నా చాలామంది ఆసక్తిచూపించరు. ఆటోలో అయితే వేడిగాలి భయం. పైనుంచి వడగాలి బోనస్.  ఐతే.. వెస్ట్ బెంగాల్ లోని ఓ ఆటోవాలా.. క్రియేటివిటీ చూపించాడు. తన ఆటోలో ఎటువంటి టెన్షన్ లేకుండా ఎక్కండి.. చల్లచల్లని వాతావరణంలో మీ డెస్టినేషన్ కు చేరిపోండి అంటున్నాడు.

ఈ ఆటోవాలా పేరు విజయ్ పాల్. తన ఆటో టాప్ పైనే ఓ పచ్చని తోటను సర్దేశాడు. రూఫ్ టాప్ పైన మట్టి నింపాడు. రోజూ నీళ్లు పోసి.. పచ్చని గడ్డి… చిన్న పూల మొక్కలు పెంచుతున్నాడు. బరువెక్కువ కాకుండా… ఎప్పటికప్పుడు పద్ధతిగా గార్డెనింగ్ చేస్తున్నాడు. తన ఆటో చూసేందుకు డిఫరెంట్ గా ఉండటమే కాదు.. ఆటోలో కూర్చున్నవాళ్లకు చల్లగా అనిపిస్తుందని అంటున్నాడు ఆటోవాలా.

తన ప్రయత్నంతో ఓ మెసేజ్ కూడా ఇస్తున్నాడు ఆటోవాలా. చెట్లను ఎక్కడికక్కడ తొలగించడం వల్లే వేడి పెరిగిపోతోందని.. అందరూ చెట్లు పెంచాలన్నదే తన ఉద్దేశమని చెప్పాడు. పచ్చదనం పెంచేందుకు ఓ ఆటోవాలా ఏం చేయగలడు…? పొగగొట్టంతో కాలుష్యం పెంచే ఆటోలతోనే.. పర్యావరణానికి మంచిని ఎలా చేసి చూపించొచ్చు..? అనే ప్రశ్నలకు బదులుగా.. మంచి ఉదాహరణగా నిలిచాడు విజయ్ పాల్.

కోల్ కతాలోని ఈ గ్రీన్ గార్డెన్ ఆటో ఫొటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.