వండర్‌ఫుల్ లవ్ ప్రపోజల్: వీడియోకి అప్పుడే 12 లక్షల వ్యూవ్స్

వండర్‌ఫుల్ లవ్ ప్రపోజల్: వీడియోకి అప్పుడే 12 లక్షల వ్యూవ్స్

ఫిబ్రవరి నెల లవర్స్‌కి చాలా స్పెషల్. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే వస్తుందంటే.. ఏడో తేదీ నుంచే ఆ వారమంతా సెలబ్రేషన్స్ మూడ్‌లోనే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం ముందు లవ్‌కి సంబంధించిన ఏ మెసేజ్, ఫొటో, వీడియో కనిపించినా ప్రేమికులు దానిని ఆసక్తిగా చూడడం కామన్. అలా ఓ వండర్‌ఫుల్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ యువతికి బాలీవుడ్ స్టైల్‌లో లవ్ ప్రపోజ్ చేసిన వీడియోకి నెటిజన్లు ఫిదా అయ్యారు. రెండు వారాల్లో పన్నెండున్నర లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు.
ఏ ప్రేమికుడికైనా తన లవర్‌కి జీవితకాలం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. ఊహించని రీతిలో ప్రియుడు తన ప్రేమను చెబుతూ ఎదుట నిలిస్తే.. ఆ యువతి కూడా కలయా నిజమా అన్న ఫీలింగ్‌లో ఉండడం కామన్. అలాంటి ఓ అద్భుతమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇది. తన ప్రియురాలిని సముద్రాలు దాటించి.. ఈఫిల్ టవర్ ఎదుట.. స్నేహితులు, కుటుంబసభ్యుల మధ్య.. బాలీవుడ్ స్టైల్‌లో డాన్స్ చేస్తూ.. ఓ యువకుడు తన ప్రేమను వ్యక్తం చేశాడు.
అతడి పేరు శ్యామ్ షా.. ఉండేదేమో న్యూయార్క్‌లో.. ఆమె పేరు శివానీ బాఫ్నా.. ఉండేది ముంబైలో! అనుకోకుండా 2015లో ఇద్దరూ ఓ డ్యాన్స్ షో పార్ట్‌నర్స్‌గా కలిశారు. అద్భుతంగా డాన్స్ చేసిన ఆ ఇద్దరూ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌ అయ్యారు. ఆ చెలిమి కాస్తా ప్రేమగా మారింది. దాదాపు ఏడాదిన్నరగా లవ్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. ఇలా ఒకరినొకరు మిస్స్ అవుతున్న ఫీలింగ్ లోనుంచి ఓ అద్భుతమైన ఆలోచనతో ఈఫిల్ టవర్ దగ్గర లవ్ ప్రపోజ్ చేశాడు శ్యామ్. 2019 డిసెంబరు 29న ఆమెను ప్యారిస్‌కి రప్పించి.. ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి తను ఐ లవ్ యూ చెప్పే వరకూ మొత్తం వీడియో తీయించాడు. దానిని శివాని జనవరి 30న యూట్యూబ్‌లో పెట్టింది. ఈ వీడియో రెండు వారాల్లో 12.57 లక్షల మందికి పైగా చూశారు. వాలంటైన్స్ డే దగ్గర పడడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
ఆ వీడియో కింది తన లవ్ స్టోరీని టూకీ చెప్పింది శివాని. తన తల్లిదండ్రులతో కలిసి ప్రయాణమవుతున్నప్పుడు ఇంత బ్యూటిఫుల్ డే ఒకటి తన జీవితంలోకి రాబోతోందని ఊహించలేదని చెప్పింది. ముందు తాను న్యూయార్క్‌కి వెళ్తున్నామని అనుకున్నానని, కానీ తన పేరెంట్స్.. ఫ్లైట్ సడన్‌గా జర్మనీ నుంచి పారిస్‌కి డైవర్ట్ అయిందని చెప్పారని తెలిపింది. తనకు కలలో కూడా ఊహించనంత అందమైన ప్రపోజల్ రెడీగా ఉందని తెలియక పారిస్‌లో షాపింగ్ చేయొచ్చని అనుకున్నానని చెప్పిందామె. ఇక పారిస్‌ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గరి నుంచి ఏ జరిగిందో వీడియో చూడండని చెప్పి శివాని స్టోరీ ముగించింది.