రెండో రోజు భారత్ జోడో యాత్ర

రెండో రోజు భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన పాదయాత్ర నేడు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి ప్రారంభమైంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఆరంభమైన ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాల్గొన్నారు. నేడు రాహుల్ గాంధీ ఈ పాదయాత్రలో భాగంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. లాంఛనంగా ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర రాత్రి 7 గంటల వరకు సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా రాహుల్ గాంధీ పాదయాత్రను కొనసాగించనున్నారు.

ఈ పాదయాత్రపై పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ.. అవతలివాళ్లపై కామెంట్లు చేసేంత టైం తనకు లేదని.. అలా విమర్శించేవారు దేశంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారన్నారు. అర్జునుడు ద్రౌపది స్వయంవరానికి వెళ్ళినప్పుడు చేపల మీద దృష్టి పెట్టినట్లు మేం ఈ యాత్రపై దృష్టి సారిస్తామని చెప్పారు. తమ ముందున్న లక్ష్యం భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ యాత్ర పార్టీని, పార్టీ కార్యకర్తలను బలోపేతం చేస్తుందని తెలిపారు. దేశంలోని ఆర్థిక అసమానతలు, రాజకీయ కేంద్రీకరణ కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి దేశాన్ని మేల్కొల్పడానికి, బీజేపీ విభజన రాజకీయాలను ఎదుర్కోవడమే ఈ భారత్ జోడో యాత్ర ముఖ్య ఉద్దేశమని జైరాం రమేశ్ చెప్పుకొచ్చారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా చేపట్టిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కన్యాకుమారి వీధుల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఇక సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో సెప్టెంబర్ 29 వరకు ఈ యాత్ర సాగనుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.