ఎలక్షన్ టీమ్​పై బీజేపీ హైకమాండ్ కసరత్తు

 ఎలక్షన్ టీమ్​పై బీజేపీ హైకమాండ్ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఎలక్షన్ టీమ్​ను బీజేపీ హైకమాండ్ రెడీ చేస్తోంది. సంజయ్ టీమ్​లో ఆఫీసు బేరర్లుగా ఎవరెవరు ఉండాలనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది. ప్రస్తుతం ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శులు, మరో ఎనిమిది మంది ఉపాధ్యక్షులు ఆఫీసు బేరర్లుగా కొనసాగుతున్నారు. వీళ్లలో సరిగా పని చేయనోళ్లను తీసేసి, వాళ్ల స్థానంలో చురుకైన నాయకులకు బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్ చార్జ్ అరవింద్ మీనన్, సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాశ్.. ఇటీవల సంజయ్ తో పాటు ఇతర సీనియర్ నాయకులతో సమావేశమై ఆఫీస్ బేరర్ల నియామకంపై చర్చించినట్లు తెలిసింది. ఎలక్షన్ టీమ్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? ప్రస్తుతం ఉన్నోళ్లలో ఎవరిని తప్పించాలి? అనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉండగా, ఆ సంఖ్యను ఐదుకు పెంచాలని.. అదే విధంగా కార్యదర్శులు, ఉపాధ్యక్షుల సంఖ్యను 8 నుంచి 10కి పెంచాలని హైకమాండ్ ను సంజయ్ కోరినట్లు తెలిసింది. అయితే కీలక పదవుల సంఖ్యను పెంచేందుకు హైకమాండ్ ఒప్పుకోనట్లు సమాచారం. పదవుల సంఖ్యను పెంచకుండా పనితీరు బాగాలేని వాళ్లను తప్పించి, చురుకైన నాయకులను నియమించుకోవాలని సంజయ్ కి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

జూన్​లో జనరల్ సెక్రటరీ పోస్టు భర్తీ.. 

రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలకంగా ఉండే జనరల్ సెక్రటరీ పోస్టు ఏడాదిగా ఖాళీగానే ఉంది. మంత్రి శ్రీనివాస్ ను ఇక్కడి నుంచి పంజాబ్ కు బదిలీ చేసిన తర్వాత ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. ఈ పోస్టును సంఘ్ సూచన మేరకే నియమించాల్సి ఉంటుంది. జూన్ లో ఈ పోస్టును భర్తీ చేస్తామని సంఘ్ నేతలు బీజేపీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలోని 33 జిల్లాల పార్టీ అధ్యక్షుల్లో దాదాపు సగం మంది ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని గుర్తించారు. వీరిలో కొందరిపై వేటు వేసి సమర్థులైన నాయకులకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. కొన్ని జిల్లాల అధ్యక్షులకు హెచ్చరికలు జారీ చేయాలనే ఆలోచనలో ఉంది.