మినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్​ ఆఫీసు ముందు ధర్నా

మినీ టాంక్ బండ్ పేరుతో రూ.6 కోట్ల దోపిడీ.. పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్​ ఆఫీసు ముందు ధర్నా

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మచెరువును మినీ టాంక్ బండ్ గా మార్చే పేరుతో రూ.6 కోట్లు మింగేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తొమ్మిదేండ్లు గడుస్తున్నా మినీ టాంక్ బండ్ పనులు పూర్తి కాలేదని,  బీఆర్ఎస్ కాంట్రాక్టర్ చేసిన  పనులు నాణ్యత లేక  వర్షాలకు కొట్టుకుపోయాయని మండిపడ్డారు.  నిధుల వృధాను నిరసిస్తూ   హుస్నాబాద్​బీజేపీ  పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్​బాబు ఆధ్వర్యంలో సోమవారం  ఇరిగేషన్​ ఆఫీసు ముందు ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే తీరు వల్లనే  అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని వారు విమర్శించారు. సిద్దిపేటలోని కోమటిచెరువు అందంగా రూపుదిద్దుకున్నా, హుస్నాబాద్  చెరువు పనులు ఎందుకు  పూర్తి కావడంలేదని   ప్రశ్నించారు. 

సిద్దిపేట, గజ్వేల్​లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయినా ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టుకు మోక్షం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా  మినీ టాంక్ బండ్ పనులు పూర్తి చేయించాలని, అంతకుముందు జరిగిన పనుల్లో  అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  ధర్నాలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణు, పార్టీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప పాల్గొన్నారు