ఇష్టం లేని పెళ్లి.. వరుడి చెంప పగలగొట్టిన వధువు.. 

ఇష్టం లేని పెళ్లి.. వరుడి చెంప పగలగొట్టిన వధువు.. 

యూపీలో ఓ పెళ్లి వేడుకలో వధువు చేసిన పని ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న కోపంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెంప చెళ్లుమనిపించి స్టేజి దిగి వెళ్లి పోయింది. చివరకు పోలీసుల జోక్యంతో ఈ జంట ఒక్కటైంది. యూపీ హమీర్పూర్ జిల్లాకు చెందిన రవికాంత్ అహిర్వార్ కు రీనాలతో పెళ్లి నిశ్చయమైంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఘనంగా వరమాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వరుడు రవికాంత్ వధువు రీనా మెడలో పూల మాల వేయబోగా ఆమె అడ్డుకుంది. కోపంతో ఊగిపోతూ అతని చెంపలు వాయించి స్టేజి దిగి వెళ్లిపోయింది. పెళ్లి ఇష్టం లేకపోవడంతో వరుడిని కొట్టి రీనా వెళ్లిపోయినట్లు ఆమె తరఫు బంధువులు చెప్పారు. 


పెళ్లి కూతురు రీనా మండపం నుంచి వెళ్లిపోవడంతో పెద్ద గొడవే జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలతో మాట్లాడారు. వధువుకు సర్దిచెప్పి పెళ్లికి ఒప్పించడంతో వివాహం సజావుగా జరిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.