నిరు పేద కూలీల‌ను వ‌దిలేసి.. డ‌బ్బున్నోళ్ల బిడ్డ‌లనే.. తీసుకురావ‌డం అన్యాయం

నిరు పేద కూలీల‌ను వ‌దిలేసి.. డ‌బ్బున్నోళ్ల బిడ్డ‌లనే.. తీసుకురావ‌డం అన్యాయం
  • కోచింగ్ సెంట‌ర్ల‌లో చిక్కుకున్న విద్యార్థుల్ని వెన‌క్కి తీసుకురావ‌డం అన్యాయం

ఐఐటీ, జేఈఈ ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల‌కు దేశంలోనే టాప్ కోచింగ్ సెంట‌ర్లకు రాజ‌స్థాన్ లోని కోట బాగా పాపుల‌ర్. క‌రోనా క‌ట్ట‌డి కోసం అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా అక్క‌డ అనేక రాష్ట్రాల‌కు సంబంధించిన వేలాది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఒక్క‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు చెందిన విద్యార్థులే దాదాపు 9 వేల మంది అక్క‌డ కోచింగ్ సెంట‌ర్ల‌లో నిలిచిపోయార‌ని తెలుస్తోంది. వారిని స్వ‌స్థ‌లాల‌కు త‌ర‌లించేందుకు యూపీ ప్ర‌భుత్వం నిన్న 300 బ‌స్సుల‌ను పంపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీనిని బీహార్ సీఎం నితీశ్ కుమార్ త‌ప్పుప‌ట్టారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల‌ను వ‌దిలేసి విద్యార్థుల‌ను మాత్రమే తీసుకెళ్ల‌డం అన్యాయ‌మ‌ని అన్నారు. నిరుపేద కూలీల‌ను వారి సొంత ఊర్ల‌కు పంపేందుకు అనుమ‌తి నిరాక‌రించిన ప్ర‌భుత్వాలు ఇలా విద్యార్థుల‌ను మాత్ర‌మే త‌ర‌లించ‌డం స‌రిక‌దాన్నారు.

విద్యార్థుల్ని వెన‌క్కి తీసుకొచ్చి.. వ‌ల‌స కార్మికుల్ని వ‌దిలేస్తారా?

కోట కోచింగ్ సెంట‌ర్ల‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న వారంతా బాగా డ‌బ్బున్న కుటుంబాల‌కు చెందిన వార‌ని, ఆ విద్యార్థుల్లో చాలా మంది వాళ్ల కోట‌లోనే వారి కుటుంబాల‌తో ఉంటున్నార‌ని చెప్పారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. బీహార్ లో కొన్ని వారాలుగా నిరుపేద వ‌ల‌స కూలీలు నిలిచిపోయి ఉన్నార‌ని, వారిని వ‌దిలేసి అత్య‌వ‌స‌రంగా డ‌బ్బున్నోళ్ల బిడ్డ‌ల‌ను తీసుకెళ్లాల్సిన అవ‌స‌రమేంట‌ని ప్ర‌శ్నించారు. లాక్ డౌన్ లోనూ ఆ విద్యార్థుల‌ను ఇళ్ల‌కు చేర్చ‌డం.. వ‌ల‌స కార్మికుల పట్ల అన్యాయంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే ఇది లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని అన్నారు.

ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండండి

బీహార్ కు చెందిన విద్యార్థులు, కార్మికులు ఇత‌ర రాష్ట్రాల్లో నిలిచిపోయి ఉంటే ఎక్డి వారు అక్క‌డే ఉండాల‌ని సూచించారు నితీశ్ కుమార్. త‌మ ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ ఎవ‌రికీ ఇబ్బంది రాకుండా చూసుకోవాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. ఈ స‌మ‌యంలో ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల్ల‌ క‌రోనా వ్యాపించే ప్ర‌మాదం పెరుగుతుంద‌న్నారు.