నిరుపేద ఇంటిని కూల్చి..రాత్రికి రాత్రే బీఆర్​ఎస్​ గద్దె కట్టిన్రు

నిరుపేద ఇంటిని కూల్చి..రాత్రికి రాత్రే బీఆర్​ఎస్​  గద్దె కట్టిన్రు
  • పార్టీ ఆఫీస్‍ కడ్తం.. జాగా ఇవ్వాలని బెదిరింపులు 
  •     రాత్రికిరాత్రే   ఇంట్లో సామాన్లు, కరెంట్‍ మీటర్‍ మాయం  
  •     బీఆర్​ఎస్​  ఎమ్మెల్యే అనుచరుల జులుం  
  •     ముగ్గురు పిల్లలతో  రోడ్డునపడ్డ నిరుపేద   మహిళ

వరంగల్‍, వరంగల్ సిటీ, వెలుగు:  పేదలకు  పక్కా ఇండ్ల కోసం పట్టాలు ఇస్తామని మంత్రి కేటీఆర్‍ శుక్రవారం గ్రేటర్​టూర్​లో   ప్రకటించగా ..  పార్టీ జెండా గద్దె కోసం   బీఆర్‍ఎస్‍ లీడర్లు  ఓ పేద మహిళ ఇంటిని దౌర్జన్యంగా కూల్చేశారు.  ఆమె ప్లాట్‍లో అధికార పార్టీ కార్పొరేటర్‍ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గులాబీ  తోరణాలు కట్టారు.  ఎన్నో ఏండ్లుగా అక్కడ ఉంటున్న పేద మహిళ తన ముగ్గురు పిల్లలతో రోడ్డున పడింది.  బాధితుల కథనం ప్రకారం,  వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటకు చెందిన దామెర మహబూబీ,  అశోక్‍ దంపతులు  15 ఏండ్ల  నుంచి వరంగల్‍ దేశాయిపేటలోని  ఎంహెచ్‍ నగర్‍లో   60 గజాల స్థలంలో రేకుల ఇల్లు కట్టుకుని ఉంటున్నారు.  అశోక్‍ హైదరాబాద్‍లో ఆటో నడుపుకుంటుండగా..  మహబూబీ  ముగ్గురు పిల్లలతో ఇక్కడ ఉంటోంది. తల్లి   ఆరోగ్యం బాగాలేకపోవడంతో అప్పుడప్పుడు  తల్లిగారింటికి   వెళ్తోంది.  ఈ ప్రాంతంలో బెల్ట్ షాప్‍ నడుపుతున్న ఎమ్మెల్యే అనుచరుడి   కన్ను ఆ ప్లాట్‍పై పడింది.   ప్లాట్‍ ఖాళీ చేసి వెళ్లిపోవాలని లోకల్​ లీడర్  చాలాసార్లు బెదిరించినా  ఆమె వినలేదు.  మంత్రి కేటీఆర్‍   పర్యటనకు వస్తున్న ముందురోజు ఆమె తన తల్లిగారింటికి వెళ్లిన సమయం చూసుకుని గురువారం  కొందరు బీఆర్​ఎస్​  నేతలు మహబూబీ రేకుల ఇంటిని కూల్చివేశారు. ఇంట్లోని సామాను మాయం చేశారు.  

బాధితురాలికి బీజేపీ లీడర్ల పరామర్శ

ఇల్లు కూల్చడంతో  నిరాశ్రయులరాలైన మహబూబీని   ఎంహెచ్‍ నగర్‍లో  బీజేపీ నేతలు కుసుమ సతీశ్​, ఆడెపు వెంకట్‍ పరామర్శించారు.  అధికార పార్టీ నేతల తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. పోలీసు అధికారులు  మహబూబీ ఇంటిని కూల్చి పార్టీ గద్దె నిర్మించినవారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‍ చేశారు. ధర్నాలో బీజేపీ లీడర్లు జన్ను సుబ్రమణ్యం, తిరుపతి, రాజు పాల్గొన్నారు.   

రాత్రికిరాత్రి బీఆర్‍ఎస్‍ జెండా గద్దె కట్టిన్రు..

మహబూబీ   ఇంటిని కూల్చి రాత్రికిరాత్రే అక్కడ గద్దె నిర్మించి బీఆర్​ఎస్ జెండా ఆవిష్కరించారు.   విషయం తెలుసుకుని   శుక్రవారం ఉదయమే తన ఇంటికి చేరుకున్న బాధిత కుటుంబం  ఇంటి స్థానంలో బీఆర్‍ఎస్‍ పార్టీ జెండా, కార్పొరేటర్‍ ఫ్లెక్సీ  ఉండడం చూసి  షాక్‍ అయింది. నిరుపేదలైన తమను   రోడ్డున పడేశారంటూ  ముగ్గురు పిల్లలతో కలిసి జెండా గద్దె దగ్గరే  కూర్చొని కన్నీరుమున్నీరయ్యారు.  గద్దె కట్టినవారే దాన్ని  కూల్చివేయాలని,   తిరిగి రేకుల ఇల్లు కట్టుకుంటామని   ప్రాథేయపడింది.  స్థానిక కార్పొరేటర్‍ కు తన గోడు చెప్పుకున్నా  పట్టించుకోలేదని, తననే  బెదిరిస్తున్నారని   మహబూబీ వాపోతోంది.  ఇంతకుముందు  అశోక్‍ తన ఆటోను ఇంటిముందు పెట్టగా రాత్రి పూట  గుర్తు తెలియని వ్యక్తులు   నిప్పు పెట్టారు.  పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

పార్టీ ఆఫీస్‍ రూం కడతామంటున్నరు..  

మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఇల్లు గడవడమే  కష్టంగా ఉన్నది. ఈ పరిస్థితిలోనే  అమ్మ ఆరోగ్యం బాగాలేకపోవడంతో   పిల్లలను తీసుకుని  ఇల్లందకు పోయిన.   ఇక్కడ బెల్ట్​షాప్​  నడిపే కంచె రాజు  మా ఇంటి జాగాలో   బీఆర్‍ఎస్‍ పార్టీ ఆఫీస్‍ కడుతామని.. మా జాగా ఇయ్యమని బెదిరించిండు. కార్పొరేటర్‍ జోషి, పెద్దలీడర్లు తన వెనుక ఉన్నరని   చెప్పిండు. ఇదే విషయాన్ని కార్పొరేటర్‍కు చెబితే ఆయన పట్టించుకోలే. మేం లేనిది చూసి రెండ్రోజుల కింద రాత్రికిరాత్రి ఇల్లు కూల్చిన్రు. పార్టీ గద్దె కట్టిన్రు.  ఇంట్లో ఉన్నకూలర్‍,   టేబుల్‍తో పాటు కరెంట్‍ మీటర్‍ కూడా కనపడకుండా చేసిన్రు. పెద్ద సార్లు  మాకు న్యాయం చేయాలే. లేకుంటే  మాకు సావే దిక్కు.   
- మహబూబీ, బాధిత మహిళ