ఎమోజీ కాదు.. సంతకం: ఇకపై 'థమ్స్ అప్ ఎమోజీ'లు పంపితే చిక్కులే

ఎమోజీ కాదు.. సంతకం: ఇకపై 'థమ్స్ అప్ ఎమోజీ'లు పంపితే చిక్కులే

మీకు ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపితే.. అవునా? కాదా? అని చెప్పటానికి ఏం చేస్తారు. అవును అయితే 'థమ్స్ అప్ సింబల్'తో రిప్లై ఇస్తారు.. కాదు అంటే డౌన్ సింబల్ చూపిస్తారు. ఇలాంటి ఎమోజీలు ఎన్నో.. మరెన్నో మన మొబైల్ ఫోన్లలో ఉన్నాయి. ఆనందంగా ఉంటే ఒక ఎమోజీ.. కామెడీకి మరో ఎమోజీ.. దుఖానికి ఇంకో ఎమోజీ. మన ఫీలింగ్‌ను అక్షరాల్లో కాకుండా ఓ చిన్న చిత్రం.. సింబల్ ద్వారా తెలియజేయటం అన్నది టెక్నాలజీ యుగంలో కామన్. ఇప్పటి వరకు ఇది వ్యక్తిగతం అయినా ఇకపై ఇదే ఎమోజీ మన సంతకం కాబోతుంది. మన అంగీకారం కాబోతోంది. అవును.. ఇది ఎవరో చెప్పింది కాదు.. సాక్షాత్తు ఓ దేశ కోర్టు చెప్పింది. 

రైతుకు, కొనుగోలుగుదారుడికి మధ్య తలెత్తిన వివాదంలో "థంబ్స్ అప్" ఎమోజీని సంతకంగా గుర్తిస్తూ కెనడా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అంతేకాదు న్యాయస్థానాలు ఆధునిక సాంకేతికతను అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టే తీర్పు ఉండాలని ఆయన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. ఫలితంగా, ఒప్పందాన్ని ఉల్లంఘించిన రైతుకు $61,442 (భారత కరెన్సీలో 50 లక్షలు) చెల్లించాలని ఆదేశించారు.

ఏం జరిగిందంటే..?

రెండేళ్ల క్రితం రైతు(క్రిస్ అచ్టర్‌)కు, కొనుగోలుగుదారుడి(కెంట్ మిక్కిల్‌బరో)కి మధ్య క్రయవిక్రేతల గురుంచి ఒప్పందం జరిగింది. ఆ సమయంలో రైతు 86 టన్నుల ఫ్లాక్స్‌ను $12.73 (భారత కరెన్సీలో 1050) ధరకు విక్రయించేందుకు అంగీకరించారు. ఈ ఒప్పందం విషయంపై కెంట్ మిక్కిల్‌బరో సందేశం పంపగా.. క్రిస్ అచ్టర్‌ అంగీకరిస్తున్నట్లు 'థంబ్స్ అప్' ఎమోజీని పంపించారు. 

అనంతరం ధర పెరగడంతో రైతు ఆ ఒప్పందాన్ని తిరస్కరించారు. మునుపటి ధరకు అమ్మలేనని తెగేసి చెప్పారు. ఈ విషయమై కొనుగులుదారుడు కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి అతనికి అనుకూలంగా తీర్పునిచ్చారు. రైతు పంపిన ఎమోజీని అంగీకార సంతకంగా న్యాయమూర్తి గుర్తించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గానూ రైతుకు జరిమానా విధించారు.