‘షార్ట్’గా తీయండి.. ప్రైజ్ కొట్టండి

‘షార్ట్’గా తీయండి.. ప్రైజ్ కొట్టండి
  • బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు లేబర్ డిపార్ట్ మెంట్‌ వినూత్న ఆలోచన
  • షార్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ వీడియోలకు నగదు పురస్కారం
  • మొదటి బహుమతి రూ. 50వేలు, రెండో బహుమతి రూ. 25వేలు

హైదరాబాద్, వెలుగు : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రాష్ట్ర కార్మిక శాఖ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. ఆ శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ రిసోర్స్ సెంటర్‌‌తో  కలిసి డాక్యుమెంటరీ పోటీలను నిర్వహిస్తోంది. బాలకార్మిక వ్యవస్థ నియంత్రణకు సమాజంలో అవగాహన పెంచేలా షార్ట్ ఫిలిం ద్వారా అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. ఫ్యాక్టరీలు, హోటళ్లు, ఇళ్లలో పనిచేసే బాలలను గుర్తించి, బడిలో చేర్చి మెరుగైన భవిష్యత్‌‌కు బాటలు వేసేలా వీడియోలతో ప్రచారం చేయనుంది. ప్రతి ఏటా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుండగా సిటీలో  ఏదో ఒక చోట బాల కార్మికులు పట్టుబడుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో వీడియో రూపంలో ప్రచారం చేసేలా షార్ట్ ఫిల్మ్‌‌లను తీయనుంది. 3 నిముషాల షార్ట్ ఫిల్మ్‌‌, డాక్యుమెంటరీలకు నగదు పురస్కారం ఇవ్వనుంది. ఇళ్లలో పనిచేసే పిల్లలు, వ్యవసాయ రంగంలోని బాలలు, ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తున్న బాలికలు, లైంగిక వేధింపులకు గురవుతున్న పిల్లలు, బాలకార్మిక చట్టంలోని బాలల హక్కుల వంటి అంశాలను ప్రస్తావిస్తూ వీడియోను చిత్రీకరించాలి. ఈ నెలాఖరులోగా పంపిన వాటిల్లో నుంచి ఎంపిక చేసి అత్యుత్తమ చిత్రానికి నగదు బహుమానం ప్రకటించింది.

థీమ్ మరవొద్దు

వీడియో తెలుగు లేదా ఇంగ్లీష్ లో ఉండాలి. వేరే భాషల్లో ఉంటే సబ్ టైటిల్స్ తోపాటు చైల్డ్ లేబర్ కాన్సెప్ట్ వచ్చేలా ఉండాలి. అదేవిధంగా గతంలో ప్రదర్శించిన వీడియోలను ఎంట్రీ కోసం పంపొద్దని, పోటీ ఫలితాలు వచ్చేవరకు ఎక్కడ ప్రదర్శించకూడదు. షార్ట్ ఫిలింలో బాలకార్మిక చట్టానికి సంబంధించిన కథనం, సామాజిక సందేశంతోపాటు యానిమేషన్ రూపంలోనూ వీడియోలుగా చిత్రీకరించవచ్చు. దీంతోపాటు వీడియో చివరన చైల్డ్ లైన్ నెంబర్ 1098తోపాటు, RedCard2ChildLabour అనే పోస్టర్​ తప్పక ఉండాలి. ఈ పోస్టర్ ను  http://bit.ly/2V8MXlm లింక్ ద్వారా పొందొచ్చు. ముఖ్యంగా బాల కార్మిక చట్టం ఉల్లంఘిస్తే జరిమానాలు, ‘బాల కార్మిక రహిత తెలంగాణ – బంగారు తెలంగాణ’ అనే సందేశం ఉండాలి. దీంతోపాటు షార్ట్ ఫిలింలో 14 ఏళ్ల లోపు పిల్లలు ఎలాంటి పనిలోనూ ఉండరాదని, 15- నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన పిల్లలు ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేయరాదనే నిబంధనలు విధించింది. దీనికోసం ఇప్పటికే ఫేస్ బుక్ ద్వారా విస్తృత ప్రచారం చేస్తుండగా, మరిన్ని వివరాల కోసం www.facebook.com/RedCard2ChildLabour లేదా  directorsrctg@gmail.com కు ఈమెయిల్ లేదా, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న కార్మిక భవనంలో సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.

వ్యూస్ ఎక్కువగా వస్తే  ప్రత్యేక బహుమతి 

ఔత్సాహికులు సిద్ధం చేసిన వీడియోకు యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చే ఆదరణను కూడా పరిగణలోకి తీసుకుని లేబర్ కమిషన్ నగదు పురస్కారం అందజేయనుంది. మూడు కేటగిరీల్లో  ప్రైజ్ మనీ ఆఫర్ చేయనుంది. బెస్ట్ ఫిలిం మొదటి బహుమతిగా రూ. 50వేలు, రెండో బహుమతిగా రూ. 25వేలు, సోషల్ మీడియాలో వచ్చే వ్యూస్ ను కూడా పరిగణలోకి తీసుకోనుంది. దీనికోసం ఆ వీడియోలో ఉన్న కంటెంట్, సందేశం ప్రస్తావిస్తూనే, ఆదరణ వచ్చేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వీడియోకు రూ. 10వేలు ప్రత్యేక బహుమతిగా అందజేయనుంది.