ఉపఎన్నికలకు సీఈసీ మార్గదర్శకాలు జారీ

ఉపఎన్నికలకు సీఈసీ మార్గదర్శకాలు జారీ

ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం పక్కనే ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉపఎన్నికతో నేరుగా సంబంధం ఉన్న ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC)స్పష్టం చేసింది.  దీనికి సంబంధించి  రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు CEC మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గాల సమీపంలో ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అక్కడ ఎన్నికల కోడ్, కరోనా నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.

ఉపఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనూ ఎన్నికల కార్యకలాపాల విషయంలో ఎంసీసీ, కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయంది CEC.కేవలం అభివృద్ధి, పాలనాపరమైన కార్యకలాపాలకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా మొత్తం కాకుండా నియోజవర్గానికి మాత్రమే పరిమితం చేస్తూ గతంలో ఆదేశాలు జారీ చేశామంది. అయితే అదే జిల్లాలో నియోజకవర్గం వెలుపల రాజకీయ కార్యకలాపాలు కొనసాగడం ఈ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పింది. ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ కూడా అమల్లో ఉంటుందని.. జిల్లాల ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.