ప్రాజెక్ట్ లపై కేంద్ర గెజిట్ రద్దు చేయాలి : టీజేఎస్ వినతి

ప్రాజెక్ట్ లపై కేంద్ర గెజిట్ రద్దు చేయాలి :  టీజేఎస్ వినతి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా కేటాయించాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బుధవారం టీజేఎస్ బృందం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్​షెకావత్, కేంద్ర డిప్యూటీ హోం శాఖ మంత్రి నిత్యానంద రాయ్ లను కలిసి వినతిపత్రాలు అందజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో  తెలంగాణకు రావాల్సిన వాటా రాకుండా ఆంధ్ర నాయకులు ఎక్కువ నీటిని వాడుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ అన్యాయం తట్టుకోలేకే  దశాబ్దాలపాటు పోరాడి ఎన్నో త్యాగాలు, బలిదానాలతో  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయినా ఆంధ్ర, రాయలసీమ నాయకులు కృష్ణా నది నుంచి అక్రమంగా తరలించుకుపోతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే తెలంగాణ తన వాటా కోల్పోయి నష్టపోతుండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్ తెలంగాణకు మరింత అన్యాయం చేసేలా ఉందన్నారు. ఫలితంగా నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని కోదండరాం షెకావత్ కు వివరించారు. రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటీ, హార్టి కల్చర్ యూనివర్సిటీ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర డిప్యూటీ  హోంమంత్రి ని కోరారు.