అయోధ్య రామ మందిర ట్రస్టుకు కేంద్రం తొలి విరాళం @ రూ.1

అయోధ్య రామ మందిర ట్రస్టుకు కేంద్రం తొలి విరాళం @ రూ.1

అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేసింది. నిన్న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో ట్రస్టుపై ప్రకటన చేశారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్ష్రేత్ర’ అని ట్రస్టుకు పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ ట్రస్టు పనులు మొదలుపెట్టే ముందు బుధవారం లాంఛనంగా కేంద్రం విరాళం అందజేసింది. నగదు రూపంలో ఒక రూపాయిని తొలి విరాళంగా ఇచ్చారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి డి.ముర్ము.

15 మంది సభ్యులతో ట్రస్టు

రామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్ష్రేత్ర’ అన్న పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసిన కేంద్రం అందులో 15 మంది ట్రస్టీలను నియమించింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసులో రామ్ లల్లా తరఫున వాదించిన లాయర్ కె.పరాశరన్, ఆధ్యాత్మిక గురువులు, ఓ ఐఏఎస్ అధికారి, ఓ దళిత సభ్యుడు ఉండేలా ట్రస్టీలను ఎంపిక చేసింది. ఈ ట్రస్టీల ఆద్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఇందుకోసం అనుసరించాల్సిన సంప్రదాయ, శాస్త్రపరమైన నియమాలను రూపొందించడంతో పాటు విరాళాల సేకరణ, ఇతర కార్యక్రమాలను ట్రస్టు నిర్వహిస్తుంది. ఈ ట్రస్టుకు ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో ఆఫీసు కేటాయించబోతోంది కేంద్ర ప్రభుత్వం. కార్యాలయం సిద్ధమయ్యే వరకు లాయర్ పరాశరన్ ఇంటి నుంచి ట్రస్టు పని చేస్తుందని ఓ అధికారి తెలిపారు.