లఢఖ్‌లో సరిహద్దు దాటిన చైనా సైనికుడు.. అరెస్టు చేసిన ఆర్మీ

లఢఖ్‌లో సరిహద్దు దాటిన చైనా సైనికుడు.. అరెస్టు చేసిన ఆర్మీ

లఢఖ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా ఆర్మీ సైనికుడిని లఢఖ్‌లో భారత బలగాలు అరెస్టు చేశాయి. సోమవారం ఉదయం లఢఖ్‌లోని చుమార్ – డెంచోక్ ఏరియాలో భారత్ భూభాగంలోకి ప్రవేశించడంతో  చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్ వాంగ్ యా లాంగ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సైనికుడు తప్పిపోయి సరిహద్దు దాటి వచ్చాడని మన ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి.

తీవ్రమైన చలిలో ఇబ్బందిపడుతున్న అతడికి ముందుగా ఆక్సిజన్ సపోర్ట్‌తో పాటు వైద్య సాయం అందించినట్లు మన ఆర్మీ అధికారులు తెలిపారు. అతడికి మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకునే దుస్తులు అందించామని చెప్పారు. తమ సైనికుడు మిస్ అయ్యాడని, భారత ఆర్మీ గుర్తిస్తే చెప్పాలని చైనా నుంచి ఇప్పటికే రిక్వెస్ట్ అందిందని అన్నారు. దౌత్య, ఆర్మీ ప్రొటోకాల్స్ ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి చుషుల్ – మోల్డో మీటింగ్ పాయింట్ దగ్గర చైనా అధికారులకు అతడిని అప్పగిస్తామని చెప్పారు. అయితే ఆ సైనికుడు పట్టుబడిన సమయంలో అతడి దగ్గర మిలటరీకి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాది మే నెల నుంచి చైనా – భారత్ మధ్య లఢఖ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 15న ఇరు దేశాల సైనికుల మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది ఇండియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో చైనా జవాన్లు కూడా దాదాపు 30 మందికి పైగా మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య టెన్షన్స్ పీక్‌కి చేరాయి. గాల్వన్ లోయ, ప్యాంగాంగ్ లేక్ సహా పలు ప్రాంతాల్లో భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడంతో ఈ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

గాల్వన్ లోయ ఘటన తర్వాత చైనా వెనక్కి తగ్గింది. అయినప్పటికీ రెండు దేశాలూ సరిహద్దు వద్ద భారీగా బలగాలను, ఆయుధాలను మోహరిస్తున్నాయి. దీంతో టెన్షన్ తగ్గేందుకు ఒకపక్క చర్చలు జరుగుతున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికి మూడు రౌండ్లకు పైగా రెండు దేశాల మధ్య డిప్లమాటిక్, మిలటరీ లెవల్‌లో చర్చలు జరిగాయి. మే నెలకు పూర్వం ఉన్న స్థితిలోకి రెండు సైన్యాలు రావాలని, సరిహద్దు వద్ద బలగాలను వెనక్కి పంపాలని భారత్ పట్టుబడుతోంది. ముందుగా చైనా తన బలగాలను వెనక్కి పంపితేనే ఇండియా కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఇటీవలే ప్రకటించింది. అయితే ఒక పక్క ఇలా చర్చలు జరుగుతున్న సమయంలోనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గత వారంలో లఢఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లను ఇండియా భూభాగాలుగా చూడడం లేదంటూ స్టేట్మెంట్ విడుదల చేసి అగ్నికి మరింత ఆజ్యం పోసే ప్రయత్నం చేశారు.