కాగ్నిజెంట్​ కూడా అదే బాటలో... 3,500 మంది ఉద్యోగాలు ఉఫ్...

కాగ్నిజెంట్​ కూడా అదే బాటలో... 3,500 మంది ఉద్యోగాలు ఉఫ్...
  • మనీకంట్రోల్​ నివేదికలో వెల్లడి
  • కంపెనీ కార్యాలయ స్థలాలు సైతం తగ్గింపు
  • ఖర్చు తగ్గింపులో భాగంగానే అన్న సీఈవో

ఏడాది కాలంగా టెక్​ ఉద్యోగుల్లో చాలా మంది భయంతో పని చేస్తున్నారు. కారణం.. ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో అనే ఆందోళన. వారి భయాలను నిజం చేస్తూ సాఫ్ట్​వేర్​ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా మందికి పింక్​ స్లిప్​లు ఇచ్చేస్తున్నాయి. అందులో చోటా కంపెనీలతో పాటు బడా కంపెనీలూ ఉండటం టెక్కీలను ఆందోళనకు గురి చేస్తోంది.  ఇప్పుడు కాగ్నిజెంట్ అదే బాటలో నడుస్తోంది.

ఖర్చు తగ్గించుకుంటున్నాం...

కాగ్నిజెంట్​లో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆ కంపెనీ సీఈవో రవికుమార్​ తెలిపారు. ఖర్చు తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా కంపెనీ 11 మిలియన్​ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కూడా వదులుకోనుంది. 2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పడతాయని కాగ్నిజెంట్​ చెప్పిందని మనీ కంట్రోల్​ నివేదిక వెల్లడించింది.  గతంలో ఇన్ఫోసిస్​ ప్రెసిడెంట్ గా పని చేసిన రవికుమార్​ ఈ ఏడాది జనవరిలో కాగ్నిజెంట్​ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కాగ్నిజెంట్​ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉన్నా.. దాని ప్రధాన కార్యకలాపాలు భారత్ నుంచే జరుగుతాయి. 

టెక్​ ఇండస్ట్రీలో తొలగింపుల పరంపర..

ఇటీవలే విప్రో, అమెజాన్​, యాక్సెంచర్​, ఇన్ఫోసిస్​, ఐబీఎం, గూగుల్​, మెటా, ట్విటర్​ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. టెక్​ పరిశ్రమలో ఇంకెంత కాలం ఈ పరిస్థితి ఉంటుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.