మహిళల కోసం ఏం చేసిన్రు? 

మహిళల కోసం ఏం చేసిన్రు? 

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో మహిళల కోసం ఏం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్​లో మహిళా దినోత్సవాలు ప్రారంభించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో సీతక్క మాట్లాడారు. ప్రీతి విషయంలో అన్యాయం జరిగినా సర్కారు నుంచి స్పందన లేదన్నారు.

ఆదరబాదరాగా అంత్యక్రియలను నిర్వహించారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం అంటే మహిళా పోరాట దినోత్సవమన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. గ్యాస్ సిలిండర్లు పట్టుకుని బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్నోళ్లే తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను కాలగర్భంలో కలిపేదాకా మహిళలు పోరాడాలని సూచించారు. మహిళా బిల్లుపై కవిత ఢిల్లీలో ఏ మొహం పెట్టుకుని ధర్నా చేస్తారని మాజీ మంత్రి పుష్పలీల ప్రశ్నించారు.