త్వరలో పార్లమెంట్ సెషన్.. సర్కార్‌‌ను ప్రశ్నించడానికి కాంగ్రెస్ సమాయత్తం

త్వరలో పార్లమెంట్ సెషన్.. సర్కార్‌‌ను ప్రశ్నించడానికి కాంగ్రెస్ సమాయత్తం

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 10 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైన వ్యూహాలను పన్నడంలో కాంగ్రెస్ బిజీ అవుతోంది. ముఖ్యంగా చైనాతో లడఖ్‌లో ఘర్షణలు, ఫేస్‌బుక్‌తో అధికార బీజేపీ సంబంధాల ఆరోపణలే అంశాలుగా పార్లమెంట్‌లో మోడీ సర్కార్‌‌పై విరుచుకుపడాలని కాంగ్రెస్ భావిస్తోందని సమాచారం. అలాగే కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, ఉద్యోగలేమి, వ్యవసాయ పరిస్థితుల గురించి గవర్నమెంట్‌పై ప్రశ్నల వర్షం కురిపించాలని యోచిస్తోందని తెలుస్తోంది. ఇండియా భూభాగంలో చైనా దళాలు అడుగుపెట్టలేదని మోడీ చెప్పిన నేపథ్యంలో ఆయన నుంచి సవివరమైన స్టేట్‌మెంట్‌ కోసం కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

‘కరోనా మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలని ఫిబ్రవరి మొదట్లో కేంద్రానికి రాహుల్ సూచించారు. దీనికి గాను అప్పట్లో బీజేపీ రాహుల్‌ను పరిహసించింది. కానీ ప్రస్తుతం ఇండియా రెండు మిలియన్ కేసులతో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అలాగే సరైన లాక్‌డౌన్‌ను అమలు చేయలేదు. ఫలితంగా దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఉద్యోగలేమి కూడా భారీ స్థాయిలో పెరిగింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎలా విఫలమయ్యింది, ఎందుకు ఫెయిల్ అయ్యిందో ప్రభుత్వం చెప్పి తీరాలి’ ఓ సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు. పై అంశాలన్నింటినీ పార్లమెంట్‌లో తమ పార్టీ నాయకులు ప్రస్తావించనున్నట్లు సదరు నేత పేర్కొన్నారు.